Wednesday, February 18, 2026

వీరబ్రహ్మేంద్రస్వామి జీవ సమాధి నిష్ట వహించిన పుణ్య దినం

ద్రోణ అమరావతి బ్యూరో

శ్రీ వీరబ్రహ్మేంద్రులు కాలజ్ఞానప్రవక్తగా ప్రజలందరికీ తెలిసినవారు, పామరులు ‘జేజినాయన’ ఎపుడో చెప్పారంటూ కాలజ్ఞాన తత్త్వాలలో ఇమిడివున్న వివిధ ప్రాపంచిక విషయాలను, తమ అనుభవాలను, సమకాలీన వింతలనూ కాలజ్ఞాన అంశాలతోసరిపోల్చటం తెలిసిందే విజ్ఞులెందరో కాలజ్ఞానాన్ని, తత్వాలను, వారి యోగజ్ఞానాన్ని, ఆయన నెరపిన కులాతీత, మతాతీత సంఘసంస్కార, మహిళాభ్యుదయ ఉద్యమాలను, ఆధ్యాత్మిక భావనలను విశ్లేషించారు. విశ్వ విద్యాలయాలలో పరిశోధనా గ్రంథాలను, పత్రాలను సమర్పించారు.వీరబ్రహ్మేంద్రుని అభ్యుదయ వాదిగ, మహిళాపక్షపాతిగా, సంఘ సంస్కరణ వాదానికి ఆద్యులుగా ఉపన్యాసాలు, వ్యాసాలు, గ్రంథాలు
అనేకం వెలువడుతున్నాయి. బ్రహ్మం గూర్చి, వారి మఠమూ, అప్పడు చేపట్టిన అభ్యుదయ కార్యక్రమాలు ఆనాటి కడప ప్రాంత మెకంజీ కైఫీయతులు, కర్నూలు ప్రాంత గ్రామ రికార్డులు, ఇతరాలలో అంతగ నమోదు కాలేదు. తరువాతి కాలంలో పేరొందిన రచయితలు తాము రూపొందించిన తెలుగు యోగుల గ్రంథాలలో కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి విషయమూ, సాహిత్యం, వారు నెరపిన సామాజిక చైతన్యకృషి గురించి పేర్కొనలేదు. ప్రజాకవులైన వేమన్న, స్వామి వంటి వారిని వివక్షతో పండితులు గుర్తించనే లేదు. వారి చరిత్రాంశములు, బోధలు సామాన్య ప్రజలవల్ల మాత్రమే నేటికీ మనగలిగినాయి. స్వామి తత్త్వలు, గోవిందవాక్యాలు, కాలజ్ఞానం, కాళికాంబ పద్యాలను “సౌజన్య పత్రికల” రూపంలో దూరప్రాంతాలకు శిష్యులు, సామాన్య ప్రజలు చేరవేయగా ఆ ప్రతులు తెలుగు ప్రాంతాలలో అదృష్టవశాత్తూ లభించాయి.
నాటి బ్రిటిష్ అధికారి సి.పి.బ్రౌన్ సేకరించిన ఆయన కాలజ్ఞానపు ప్రతి, పద్యసాహిత్యాన్ని ప్రాచ్యలిఖిత ప్రతుల భాండాగారాలలో భద్రపరచటం జరిగింది. వీరబ్రహ్మేంద్రయోగి, వేమన్నలు గ్రామీణ ప్రాంతాలలో పర్యటించి, సామాన్య ప్రజావళిని పాలకుల
దుష్పరిపాలన సందర్భంలో సాంత్వన పరిచేందుకు ఉద్యమించి వివిధ గేయ, పద్య రూపంలో, రచనలు, బోధలద్వార ప్రజలకు చేరువైనారు. తెలుగువారిలో వీరబ్రహ్మేంద్రులు మాత్రమే నాటి సమాజ పోకడలను
బట్టి భవిష్యత్తును ఊహించి, ప్రజలు సన్మార్గపథానికి మరలేందుకు పలు హెచ్చరికలను కాలజ్ఞానం, పద్యాలు, తత్త్వాలు, గోవిందవాక్యాల రూపంలో బోధించారు.వేమన్న పద్యాలను పరిశీలించిన బ్రౌన్ ఆయన కాలజ్ఞానాన్ని, పద్యసాహిత్యాలను సేకరించి నప్పటికీ విశ్లేషణ జరుపలేదు. ధార్మికగ్రంథాలు ప్రచురించే తిరుమల-తిరుపతి దేవస్థానం కాలజ్ఞాన ప్రచురణను 1983లో ప్రకటించి, కొందరి వ్యతిరేక లేఖల కారణంగా విరమించడం జరిగింది.వీరబ్రహ్మేంద్రునిగూర్చి విశ్వవిద్యాలయాలలో పరిశోధనలకు పూనినపుడు తత్త్వాలు బైరాగులు పాడుకునేవనీ, వానిలో విజ్ఞులు పరిశీలనకు పనికివచ్చే అంశాలు లేవని పర్యవేక్షకులు నిరాకరించిన ఘటనలూ ఉన్నాయి.వీరబ్రహ్మేంద్రుని బోధలను, చరిత్రను జవంగుల నాగభూషణ దాసు, చాటకొండ సుబ్బయ్య శ్రేష్టి, యేకాబత్తుని వడ్లారంగయ్యదాసు, డా.కొండూరు వీర రాఘవాచార్యులు, మహావాది వెంకటరత్నం, కొడాలి లక్ష్మీనారాయణ, వడ్డాది వీర్రాజు సిద్ధాంతి, కలవటాల జయరామరావు, పరిమి వీరాచార్యులు, స్వామి లింగస్వామి, పూసపాటి నాగేశ్వరరావు, నాగశ్రీ మున్నగు విద్వాంసులు తమ రచనలను భక్తి, ఆరాధనా భావం, పౌరాణిక దృక్పథాలతో వెలువరించారు, మిక్కిలిగా వ్యాసాలూ వివిధ పత్రికల్లో, గ్రంథాలలో వెలువడ్డాయి. ఆరుద్ర, ఆచార్య యన్.గోపి వంటి విజ్ఞుల పరిశీలన, స్వామివారి మఠం పీఠాధిపతులు, ఆస్థాన విద్వాంసుల అవిరళ కృషివల్ల బ్రహ్మేంద్రుని పద్యసాహిత్యం ప్రాచ్యలిఖిత గ్రంథాలయ బ్రౌన్ సేకరణలు, ఇతరత్రాలను ప్రోదిచేసి పరిష్కరింపబడి వెలువడింది. ఆధునికంగా ఆయన రచనల విస్తృత విశ్లేషణ ఆరంభమైంది. మాన్య పండితులు “దర్శనాచార్య” కొండూరు వీర రాఘవాచార్యులు, కొడాలి లక్ష్మీనారాయణ, “కళాప్రపూర్ణ” కొండవీటి వేంకటకవి, విద్వాన్ కట్టా నరసింహులు, “సాహిత్యబ్రహ్మ” డా. వి.వి.ఎల్.నరసింహారావు, డా.కన్నెకంటి రాజమల్లాచారి, డా.యండపల్లి పాండురంగాచార్యులు, డా.మూల మల్లికార్జునరెడ్డి, డా.యస్.వేణుగోపాలరెడ్డి, ఫణిదపు ప్రభాకరశర్మ, సిద్ధాంతం ప్రభాకరాచార్యులు, డా. పులికొండ సుబ్బాచారి మున్నగువారెందరో ఇందుకు విశేష కృషి చేశారు.ఇపుడు లభిస్తున్న వీరబ్రహ్మేంద్రుని రచనలు కాలజ్ఞానం, కాళికాంబా సప్తశతి(701-పద్యాలు), కాళీమకుట కందాలు(72-పద్యాలు), వీర కాళికాంబ శతకం (473-పద్యాలు), సిద్ధగురుబోధ(55-పద్యాలు), కాలజ్ఞాన తత్త్వాలు, గోవిందవాక్యాలు మున్నగు వానిలో వేదాంత, యోగ, శరీర, ఖగోళ విజ్ఞానాలు, భవిష్య, జ్ఞాన, మూఢాచార నిరసన, సంఘసంస్కార, మహిళాభ్యుదయ, నీతి బోధాత్మకాంశాలతో నిండివున్నాయి.ఈ సాహిత్య, కవితాసంచయం నేడు లభిస్తున్నందున వీరబ్రహ్మేంద్రులు గొప్ప కవీశ్వరునిగా, కాలజ్ఞానిగ, తత్వజ్ఞునిగ అత్యంత లోకప్రసిద్ధి కలిగింది. వీరబ్రహ్మేంద్రులు తన భావాలను సూటిగ, ప్రజల మనస్సులకు చేరే శైలిలో, చిన్న చిన్న మాటల ఆటవెలది పద్యాలు, వినసొంపైన తత్వాలు, ద్విపదలలో బలమైన సద్విశ్వాసాలు, యోగ, వేదాంత ఉపనిషద్విషయాలు భవిష్యదంశాలు, లోకరీతులను ఆశ్రమ శిష్యులకు, సామాన్య ప్రజలకు ఎరుక పరచి, కుల, మత, పేద ధనిక వర్గాల మధ్య సామరస్య పథానికి జాగృతం చేసిన దార్శనికుడు. నాటి సమాజ దుర్నీతులు, పోకడలను విశ్లేషించి తగు ఆచరణాత్మక విధానాలను తన రచనలలో పొందుపరచారు. తన అభ్యుదయ భావాలను ఎందరు వ్యతిరేకించినా వెనుకాడక, తగురీతిలో సమాధాన పరచి, సాంఘిక దురాచారాలు, మూఢ, అంధ విశ్వాసాల పట్ల తీవ్ర నిరసన గళమెత్తారు. శిష్యులకు, ఇతరులకు బోధించిన తన ఆశయాలను త్రికరణశుద్ధిగా పాటించి సమాజ వికాస సంస్కరణలకు బలమైన పునాదులు వేసి తరువాతి తరాలకు ఆదర్శంగా నిలిచారు. విస్తృత దేశ సంచారం చేసి, పూర్వుల మార్గంలోనే గ్రామాలలోని సామాన్య ప్రజలకు ఆచరణాత్మక సత్సాంప్రదాయాలు, జటిలమైన వేదాంత, యోగమార్గాలను సులభ శైలి, భాషలో ప్రకటించి జగద్గురువుగా, రాజయోగిగా ప్రజాదరణ పొందారు. ఆయన పద్య రచనలు విలక్షణంగా, వివిధాంశాల సమాహారంగా నాడున్న అపసవ్యవస్థలపై పోరుబాట, నిమ్నవర్గాలు, మహిళలను, ముస్లిములను, అంటరానివారన్న ఆంక్షలు, కట్టుబాట్లతో సాటిసమాజం దూరం చేసిన వారందర్నీ దగ్గరకు చేర్చుకుని తన
మఠంలో వారికి వేదవేదాంగాలు, యోగవిద్యలను బోధించటం, అగ్రకులాల, ధనిక, కల్లగురువుల దుర్మార్గాలను తూర్పార పట్టటం, పురుషులతో పాటు మహిళలకు సమాన హక్కులు, గౌరవం దక్కితీరాలని, స్త్రీలు వేదవిద్యకు అర్హులని నిర్ద్వందంగ నిరూపించడం, రజస్వలానంతర వివాహం యుక్త మనటం, విగ్రహారాధన, జంతుబలులు, జాతరలు వారించటం, కులము, మతము, సంపదలు, అంటరానితనం వంటి సామాజిక రుగ్మతలు మానవుల సామరస్య జీవనానికి అడ్డు కారాదని విస్తృత ప్రచారం చేపట్టారు. ప్రధానంగా త్రికాలజ్ఞానిగా ఆనాటి సమాజ దుర్నీతులే కారణంగా తరువాతి కాలంలో జనులు చవిచూడబోయే చెడగులు, ఖగోళ వైజ్ఞానిక రూపురేఖలు, సమాజంలోని వింత పోకడలు, విచిత్ర అంశాలు, విలయాలు, ఉత్పాతాలు
తన బోధలలో విశదపరచి, ప్రజల్ని హెచ్చరించారు. అణచివేతకు గురియైనవారు భవిష్యత్తులో ప్రధానంగా మహిళలు, దళితులు గౌరవం పొందుతారని ఘంటాపథంగా ప్రకటించారు. ఇది తమను తాము ఉన్నతులుగా ప్రకటించుకొని పెత్తనం సాగించిన ఆధిక్య వర్గాలవారికి సహజంగానే కంటగింపు కలిగించింది. ఫలితంగా బ్రహ్మేంద్రయోగి మాననీయ చరిత్ర, బోధలను వివక్షతో సాహిత్య, చరిత్రకారులు విస్మరించటం జరిగింది. వీరబ్రహ్మేంద్రుని సాహిత్యం, పద్యాలు చదువరులకు యోగము, కుండలినీ, గురు ప్రాశస్త్యము, శిష్యుని అర్హత, మహిళాభ్యుదయం, లోకరీతులు, మూఢ విశ్వాసాల వంటి అనేక విషయాల గూర్చి చర్చిస్తూ, విశదీకరిస్తూ, అవగాహన కల్పిస్తాయి. ఆ పద్యాలన్నీ ఆకట్టుకునే సరళ భాష, శైలీ, అచ్చటచ్ఛట కొన్ని ‘మరుగు వాక్యాలు’ న్నప్పటికి సూటిగా చదువరుల మనసులను తాకే భావతీవ్రత, సంస్కరణ, సార్వజనీన అంశాలు కలిగి వున్నాయి.
ఆధునిక సాంకేతికతవల్ల నేటి సమాజం ప్రధానంగా తరాల అంతరాలవల్ల సద్భావ కలిమి, ప్రశాంతత, సామరస్యాలకు దూరమవుతున్నందున వీరబ్రహ్మేంద్రుని బోధలు, కాలజ్ఞానము, పద్య సాహిత్యాంశాలు కొన్నింటిని తెలుసుకున్నా గుణాత్మక, ఆచరణాత్మక, లౌకిక మార్గదర్శనం కావటం తథ్యం. ఆయనను అభిమానించి, ఆరాధించే వారందరు వారి సందేశాలకు, బోధలకు విలువనిచ్చి చిత్తశుద్ధితో ఆచరించేటట్లయితే సమాజానికి ఎంతో మేలు కాగలదన్నది నిజం.
(కాలజ్ఞానం)
మదమాత్సర్యాలు హెచ్చి కామ క్రోధ లోభ మోహాలు హెచ్చీని
జాతి సంకరములై పరస్పర వైరంబులు పుట్టి పోట్లాటలు కొట్లాటలు మరణకర్మ కృత్యముల బహుగా చేతురు వావివర్తనములుతప్పినడిచేరు
ఒకరి సొమ్ము ఒకరు తీసుకునేరు
తల్లులు బిడ్డలు తగువులు నడిచి తల్లలాడించే దినములొచ్చేను
తిరుపతి వెంకన్నగుడి, దేవాలయములు మ్లేచ్ఛుల పాలౌను
కోనసీమలోన కలతలు పుట్టీని
ఈశాన్యమున నుండి విషగాలి వచ్చి విపరీత నరులంత చచ్చేరుమా
కృష్ణా గోదావరి మధ్యమందు కలహంబులచే పోట్లాడి చచ్చేరు
భూమి నానావర్ణములుగా కనిపించీని.
(కొన్ని కాళికాంబ పద్యాలు)

-మిత్రత్వమ్ముతో నాప్తుల శత్రుత్వముతోడ నన్య జనమును జూడన్ గాత్రమును బట్టి యము డేమాత్రము సందియము లేక మట్టును!
-గురుడే తల్లియు తండ్రియు గురుడే బ్రహ్మంబు చక్రి, గురుడే హరుడౌ గురు శిష్యులం దహంకృతి హరహర వలదనుట బ్రహ్మ మతడే!
-వంచించు వారి మాట రుచించును, రుచియింప బోవు సిద్దుల మాటల్ కొంచెపు నరులకు; కావున మంచిది మాటాడకుంట మహిలో!
√తూటు పుచ్చి కొంప ధూళి చేసినవాడె కష్టమనక తిరిగి కట్టగలడె? ముందు చూపులేక మోక్షసౌధము రాదు!
ఎరుపు నలుపు తెలుపు నెన్నివన్నెల యావులున్న నేమి? పాలవన్నె తెలుపు; మనసు తెల్లనైన కనరావు వర్ణముల్.
శూద్రుడనగ జ్ఞాన శూన్యుండు, బ్రాహ్మణుండనగ జ్ఞాని; మతము యజ్ఞ సూత్రమెఱిగినట్టి మనుజుడెవడైన బ్రాహ్మడే! మనుసుకోతి మొకరమునకు బంధింపగా పెనగులాడి మాటవినును తుదకు; మాటవిన్న మోక్షమార్గమ్ము లభియించు!
నిగ్రహమ్ము లేని నిర్భాగ్యు లెల్లరు విగ్రహముల కెల్ల విందు చేసి భోగభాగ్యములను బొంద కాంక్షింతురు! ముసలితనము కసిరి బుసగొట్టు సమయాన తాను జేయు పనులు తలచి తలచి కుమిలికుమిలి గోడు
గుడువ లామ్మేమి? ప్రేమలేని చదువు ప్రేతభూషణ మాయె నీతిలేని చదువు రోత యాయె, ప్రేమ నీతి గల్గు విద్యయే పరవిద్య! సకలమునకు శక్తి శాశ్వతాధారమై నిలుచునంచు బలికె నిగమతతులు, స్త్రీ నిజమ్ముగాను సృష్టికి మూలమ్ము! వాక్కు బ్రహ్మమనుచు వర్ణింప నేరరో, చూపు నీశుడను చూడలేరొ, కోర్కి విష్ణు వౌట కొనసాగ నీయరో! మూడు యుగములందు ముదితలు ముగ్ధలు పురుష దౌష్ట్యమునకు పొగిలినారు కలియుగాన కాంత లిల నేలగలరయా!
రూపరహితునకు రూపమ్ము గల్పించి కర్మకాండ పెంచి కలుషమతులు ధర్మమార్గములను ధ్వంసమ్ము చేసిరి! -సంసారము నందుండియు సంసారము మిథ్యచేసి సర్వము తానై సంసారమందు నిలిచిన సంసారే రాజయోగి సత్యము!
ఎన్నగ నెముకలు సున్నము, కన్నులు పుసి, నీటిబుగ్గ కాయము, వినుమీ చన్నులు మాంసపు ముద్దలు
పున్నమ దృష్టిగలవాడె పురుషుడు!
ఆకలి చంపియు కొందఱు ఆకులు తిన మోక్షమైన నడవిని తిరిగే మేకల కెల్లను మోక్షము రాకేలను పోయనయ్య రయమున!
(తత్త్వాలు):
ఆనందమయుడు గావలెను పూని, తాను తానై యున్న తావు గనవలెను, ప్రేమ సద్గురు జేరవలెను
తామస గుణముల తొలగించవలెను, భక్తి మదిలో నిల్పవలెను, జీవన్ముక్తి మార్గము తాను ముందెరుగవలెను, నిద్ర రాకడ తెలియవలెను దాని భద్రపరచుక యోగనిద్ర కనవలెను!
ఈ జన్మమిక దుర్లభమురా సాజన్మ సాకార సద్గురుని గనరా, పంచాక్షరీ మంత్ర పఠన చేయన్న పఠన చేసిన యముడు పారి పోనన్నా, పారిపోతే అంబ ఫలమిచ్చు నన్న ఫలమునందిన వాడు వరమగురుడన్నా! చిల్లర రాళ్ళకు మ్రొక్కుచు నుంటే చిత్తము చెడునుర ఒరే ఒరే, చిత్తము నందున చిన్మయ జ్యోతిని చూచుచు నుండుట సరే సరే, ఒక్క ప్రొద్దులని యెన్నుచు నుంటే ఒనరుగ చెడుదువు ఒరే ఒరే, చొక్కమైన యా వైభవ మూర్తిని చూచుచు నుండుట సరే సరే! చెప్పలేదంటనక పోయ్యేరు నరులారా గురుని చేరి మొక్కితె బతుక నేర్చేరు, మొప్పెతనమున మోసపోయేరు, అదిగాక కొందరు గొప్పతనమున గోసు మీరేరు, ఇప్పు డనగ రాదు, ఎప్పుడో ఏ వేళనో మరి గుప్పు గుప్పున దాటి పోయెడు గుర్ర పడుగులు ఏరుపడును, కేక వేసియు ప్రాణమిడిచేరు, రాకాసి మూకలు కాకబట్టి కలవరించేరు, ఆకసమ్మది ఎర్రబారును ఆరు మతములు ఒక్కటౌను, లోకమందలి జనము లందరు నీరు నిప్పున మునిగిపోదురు. చెప్పలేదంటనక పోయ్యేరు!
వీరబ్రహ్మేంద్రుని బోధలు తెలుసుకోవటం మాత్రమేకాక
మనః పూర్వకంగా ఆచరించటం మనందరి తక్షణ కర్తవ్యం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular