Wednesday, February 18, 2026

తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

ఇప్పటివరకూ వాహనాల రిజిస్ట్రేషన్‌కు మాత్రమే పరిమితమైన టీజీ నిబంధన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అన్ని అధికారిక వ్యవహారాలకూ వర్తింపజేసేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.
తక్షణం ఇది అమల్లోకి వస్తున్నట్లు పేర్కొన్న ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఇకపైన ‘టీఎస్’ అబ్రివేషన్ స్థానంలో అధికారికంగా ‘టీజీ’ అని మార్చుకునేలా మే 31వ తేదీన డెడ్‌లైన్‌గా విధించారు. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలన్నింటికీ ఇది వర్తిస్తుందన్నారు.వెబ్‌సైట్లతో పాటు అన్ని రకాల ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లు, రిపోర్టుల్లో ఇకపైన ‘టీజీ’ పదాన్నే (అబ్రివేషన్) వినియోగించాలని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ‘టీజీ’ అనే అబ్రివేషన్‌ను అధికారికంగా గుర్తించడంతో ఈ మార్పును అన్ని విభాగాలూ అమల్లోకి తెచ్చేలా ఆయా డిపార్టెమెంట్ల కార్యదర్శులు, హెచ్ఓడీలు పర్యవేక్షించాలని సీఎస్ శుక్రవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
‘టీజీ’ అనే అబ్రివేషన్‌ను ఇకపైన అధికారికంగా వినియోగించాలని, రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఏజెన్సీలు, స్వయంప్రతిపత్తి కలిగిన (అటానమస్) సంస్థలు ఈ మార్పును కార్యాచరణలో పెట్టాలని నొక్కిచెప్పారు. అధికారులు వాడే లెటర్‌హెడ్స్, రిపోర్టులు, నోటిఫికేషన్‌లు, నేమ్ బోర్డులు, వెబ్‌సైట్‌లు, ఇతర అన్ని రకాల వినియోగంలో ఈ మార్పును చేపట్టాలని స్పష్టం చేశారు.
దీంతో ఇప్పటివరకూ టీఎస్పీఎస్సీ (తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్), టీఎస్ఆర్టీసీ (తెలంగాణ స్టేట్ ఆర్‌టీసీ) తదితర పేర్లతో కొనసాగుతున్న సంస్థలు ఇకపైన టీజీపీఎస్సీ, టీజీఆర్టీసీ అనే తీరులో మార్చుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వంలో వివిధ శాఖలు, విభాగాల మద్య జరిగే అంతర్గత కరస్పాండెన్స్ (ప్రత్యుత్తరాలు)తో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వ్యవహారంలోనూ ‘టీజీ’ అనే అబ్రివేషన్‌నే వినియోగించాలని స్పష్టం చేశారు. అన్ని శాఖలు, విభాగాలు ఈ మార్పులు చేపట్టిన అంశంపై ఆయా శాఖల కార్యదర్శులు ఈ నెల 31వ తేదీకల్లా సాధారణ పరిపాలన శాఖ జాయింట్ సెక్రటరీ (కోఆర్డినేషన్)కు రాతపూర్వకంగా (యాక్షన్ టేకెన్ రిపోర్టు) తెలియజేయాలని సీఎస్ తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందే టీఎస్ అనే అక్షరాలను టీజీ అని మారుస్తామంటూ ఆ పార్టీ నేతలు వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం ఎలక్షన్ కోడ్ అమల్లోకి రావడానికి ముందు అధికారులతో నిర్వహించిన సమీక్షలో రాష్ట్ర గేయాన్ని, లోగో (ఎంబ్లమ్), తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు తదితరాలను మార్చనున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు అది కార్యరూపం దాల్చింది. ఈ నెల 31కల్లా రాష్ట్రంలో టీఎస్ అబ్రివేషన్‌తో ఉన్న ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వ ఏజెన్సీల అబ్రివేషన్ టీఎస్ నుంచి టీజీలోకి మారనున్నది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular