Thursday, February 19, 2026

ఇది నయవంచనకు మానవతకు మధ్య పోరాటంప్రభాత్‌ పట్నాయక్‌

ఇప్పుడు అమెరికన్‌ యూనివర్శిటీల క్యాంపస్‌లలో నిరసనలు చెలరేగుతున్నాయి. ఇజ్రాయిల్‌ సైనిక యంత్రాంగంతో లావాదేవీలు నడుపుతున్న వ్యాపార సంస్థలతో తెగతెంపులు చేసుకోవాలని నిరసనకారులు డిమాండ్‌ చేస్తున్నారు. 1968-1974 మధ్య కాలంలో వియత్నాం యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ యూనివర్సిటీల క్యాంపస్‌లను చుట్టుముట్టిన నిరసనలు ఈ సందర్భంగా గుర్తుకొస్తున్నాయి. ఐతే, అప్పటికీ, ఇప్పటికీ ఒక ప్రధానమైన తేడా ఉంది. అప్పటి యుద్ధంలో అమెరికా నేరుగా దిగబడింది. ఇప్పుడలా కాదు. అమెరికా యుద్ధంలో ఉన్నప్పుడు యువతను సైనిక సేవల కోసం వినియోగించే అవకాశం ఉండేది. దాని నుంచి తప్పించుకోవాలనే స్వార్థంతో అప్పటి విద్యార్థులు నిరసనలకు దిగారు. అని భాష్యం చెప్పడానికి అవకాశం ఉండేది. కాని ఇప్పుడు తలెత్తుతున్న నిరసనల వెనుక విద్యార్థుల స్వప్రయోజనాలు ఎంత మాత్రమూ లేవని స్పష్టంగా చెప్పగలం. అదే సమయంలో వియత్నాంతో యుద్ధంలో ఉన్నప్పుడు ప్రతిరోజూ సంభవిస్తున్న అమెరికన్‌ సైనికుల మరణాల వార్తలకు స్పందించిన అమెరికన్‌ ప్రభుత్వ యంత్రాంగంలోని ఒక భాగం యుద్ధానికి ముగింపు పలకమని తీవ్రంగా ఒత్తిడి చేయసాగింది. ఇప్పుడు అటువంటి తీవ్రత ఏదీ లేదు. అమెరికా ప్రత్యక్షంగా యుద్ధంలో లేనందువలన విద్యార్థులు తెలియజేస్తున్న నిరసనలు అత్యంత సూత్రబద్దమైనవిగాను, తీవ్రమైనవిగాను పరిగణించాలి. ప్రభుత్వ యంత్రాంగం శాంతిస్థాపన కోరుతూ చేస్తున్న ప్రకటనల వెనుక అటువంటి సూత్రబద్దత గాని, తీవ్రత గాని లేదని కూడా స్పష్టం అవుతోంది.
ఇప్పుడు విద్యార్థులు అచ్చంగా మానవత్వ దృష్టితో స్పందిస్తున్నారు. జాతి హననం పట్ల తీవ్ర వ్యతిరేకత, వలసలు పోయిన వారు ఆ ప్రాంతాన్ని తమ వలసగా మార్చి ఆక్రమించుకునే విధానం పట్ల వ్యతిరేకత, జాతి విద్వేషంతో వ్యవహరిస్తున్న యూదు దురహంకార ప్రభుత్వానికి సామాజ్యవాద దేశాలు మద్దతు పలకడం పట్ల వ్యతిరేకత ఆ విద్యార్థులను నిరసనలకు పురికొల్పాయి. శాంతి, సౌభ్రాతృత్వాల కోసం తపించే మానవుల ఆకాంక్షలకు ఈ నిరసనలు ప్రతిబింబం.
ఇంకోపక్క అమెరికన్‌ ప్రభుత్వం మాత్రం రెండు నాల్కల ధోరణి ప్రదర్శిస్తోంది. ఒకపక్క శాంతి కావాలంటూ పైకి ప్రకటిస్తూనే ఆ యుద్ధం కొనసాగడానికి చెయ్యవలసినదంతా చేస్తోంది. అమాయక పౌరుల మీద సాగుతున్న క్రూర దమనకాండను ఖండిస్తూనే, ఆ క్రూరత్వాన్ని కొనసాగించ డానికి అవసరమైన ఆయుధాలను సరఫరా చేస్తోంది. విద్యార్థుల నిరసనలు మానవత్వానికి ప్రతీకలుగా ఉంటే… అందుకు పూర్తి వ్యతిరేకంగా పతన దిశగా అడుగులు వేస్తున్న సామ్రాజ్యవాదం ఉంది.
ఈ మోసకారితనం అన్ని స్థాయిలలోనూ వ్యక్తం అవుతోంది. అనేక సంవత్సరాల నుంచి సామ్రాజ్యవాద దేశాలు పాలస్తీనా సమస్యకు పరిష్కారం పాలస్తీనా, ఇజ్రాయిల్‌ వేర్వేరు రాజ్యాలుగా పక్కపక్కన ఉండటమేనన్న వైఖరికి కట్టుబడి వున్నాయి. అలా వేర్వేరు రాజ్యాలుగా విడిపోవడం మెరుగైన పరిష్కారమా లేక ఒకే రాజ్యంగా కొనసాగుతూనే సార్వత్రిక ఓటు హక్కు ద్వారా ఎన్నికైన ప్రభుత్వం కింద పాలస్తీనియన్లు, యూదులు సఖ్యంగా జీవించడం మెరుగా? అన్న చర్చ పక్కన పెడదాం. రెండు దేశాల పరిష్కారాన్ని అంతర్జాతీయ సమాజం ఎప్పటి నుంచో బలపరుస్తూ వస్తోంది. చివరికి సామ్రాజ్యవాద దేశాలు కూడా దీనిని అంగీకరించక తప్పలేదు. ఈ పరిష్కారాన్ని అమలు చేయాలంటే వెంటనే ఒక పాలస్తీనా రాజ్యం స్వతంత్రంగా ఉనికిలోకి రావాలి. పాలస్తీనాను ఐ.రా.స లో పూర్తి స్థాయి సభ్యురాలిగా తీసుకోవాలి. కాని పాలస్తీనాను పూర్తి స్థాయి సభ్య దేశంగా తీసుకోవాలనే ప్రతిపాదన ఐ.రా.స భద్రతామండలిలో చర్చకు వచ్చిన ప్రతిసారీ అమెరికా తన వీటో అధికారాన్ని ఉపయోగించి అడ్డుకుంటూనే ఉంది.
ఏప్రిల్‌ 19వ తేదీన జరిగిందిదే. ఇజ్రాయిల్‌ లోని యూదు దురహంకార ప్రభుత్వం స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటుకు వ్యతిరేకం. అలా స్వతంత్ర పాలస్తీనా ఏర్పడితే, అప్పటితో ఇజ్రాయిల్‌ అనుసరించే విస్తరణవాదానికి (బైట నుంచి వలసదారులుగా వచ్చి, ఆశ్రయం కల్పించిన ప్రాంతాన్నే స్వాధీనం చేసుకునే కుట్ర) తెర పడుతుంది. బైటకు చూస్తే అమెరికా స్వతంత్ర పాలస్తీనా ఏర్పాటుకు అనుకూలమేనన్నట్టు ప్రకటిస్తూ ఉంటుంది. కాని కీలక సందర్భం వచ్చిన ప్రతీసారీ యూదు దురహంకారాన్ని బలపరుస్తుంది. ఈ మే 10వ తేదీన ఐరాస సర్వ సభ్య సమావేశం భారీ మెజారిటీతో పాలస్తీనాకు పూర్తి స్థాయి సభ్యత్వం ఇవ్వాలని తీర్మానించింది. 143 ఓట్లు తీర్మానానికి అనుకూలంగాను, 9 వ్యతిరేకంగాను పడ్డాయి. మరో 25 దేశాలు గైర్హాజరయ్యాయి. ఈ తీర్మానంలోనే భద్రతా మండలిని ఈ అంశాన్ని పున:సమీక్షించవలసిందిగా సర్వసభ్య సమావేశం కోరింది. అమెరికాతో బాటు అర్జెంటీనా, హంగేరీ వంటి మరికొన్ని పచ్చి మితవాద దేశాలు మాత్రం ఈ తీర్మానాన్ని వ్యతిరేకించాయి. తక్కిన సామ్రజ్యవాద దేశాలు ఫ్రాన్స్‌తో సహా, తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. ఈ అంశం భద్రతా మండలి ముందుకు మళ్లీ చర్చకు వస్తే అమెరికా మరోసారి తన వీటో హక్కుని ఉపయోగించి పాలస్తీనాకు పూర్తి స్థాయి సభ్యత్వం రాకుండా మోకాలడ్డుతుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ప్రపంచ జనాభాలో అత్యధిక శాతం కోరుతున్న పరిష్కారంగాని, శాంతి స్థాపనగాని అమెరికాకు అక్కరలేదు.
తన దేశంలో తలెత్తుతున్న విద్యార్థుల నిరసనల పట్ల సైతం అమెరికన్‌ ప్రభుత్వం ఇదే విధమైన మోసపూరిత వైఖరిని అవలంబిస్తోంది. పలు క్యాంపస్‌లలో పోలీసులు ప్రవేశించి అక్కడ విద్యార్థుల నిరసన శిబిరాలను కూల్చివేశారు. వందలాది మంది విద్యార్థులను అరెస్టులు చేశారు. ఆ నిరసనలు చాలా శాంతియుతంగా నడుస్తున్నప్పటికీ పోలీసులు ఈ దమనకాండకు తెగబడ్డారు. శాంతియుతంగా కొనసాగే నిరసనల మీద ఈవిధంగా విరుచుకుపడడం భావప్రకటనా స్వేచ్ఛను హరించడమే. కాని ఈ దమనకాండను అమెరికన్‌ అధికార యంత్రాంగం యావత్తూ సమర్ధించింది. డొనాల్డ్‌ ట్రంప్‌ నుంచి జో బైడెన్‌ దాకా, హిలరీ క్లింటన్‌ సైతం ఈ అణచివేతను సమర్థించారు. ‘తీవ్రవాద మూకలు కాలేజీ క్యాంపస్‌లను స్వాధీనం చేసుకుంటున్నాయని అయినా బైడెన్‌ మాత్రం మెతకగా వ్యవహరిస్తున్నాడని’ విమర్శిస్తూ ట్రంప్‌ ప్రకటనలు కూడా చేశాడు. ఇక బైడెన్‌ వంతుకొస్తే కొలంబియా యూనివర్సిటీ తదితర క్యాంపస్‌లలో పోలీసుల దుర్మార్గాన్ని సమర్థించాడు. అక్కడ ‘ఉదారవాదుల’ మనోభావాలకు అనుగుణంగానే ఆ విద్యార్థులు యూదు వ్యతిరేకతను ప్రదర్శిస్తున్నారని ఆరోపించాడు. ఆ నిరసనకారుల్లో అనేకులు యూదు విద్యార్థులే. ఈ వాస్తవాన్ని మరుగుపరిచి వికృత వ్యాఖ్యానాలు చేశాడు. మధ్యప్రాచ్యం చరిత్ర తెలియనందువల్లే విద్యార్థులు ఈ మాదిరి ఆందోళనలకు పూనుకుంటున్నారంటూ హిలరీ క్లింటన్‌ వ్యాఖ్యానించారు. ఆ చరిత్ర జ్ఞానం పొందితే దానివల్ల అక్కడ జరుగుతున్న జాతి హననాన్ని సమర్థించ గలుగుతారా?
వియత్నాం యుద్ధ వ్యతిరేక ఉద్యమం ఒకానొక సమయానికి యూజిన్‌ మెకార్థీ, రాబర్ట్‌ కెనడీ వంటి ముఖ్య అమెరికన్‌ నేతల మద్దతు పొందింది. ఆ యుద్ధంలో అమెరికా ప్రత్యక్షంగా పాల్గొనడమే ఇందుకు కారణం. కాని ప్రస్తుత సందర్భంలో మొత్తం రాజకీయ నాయకులు, అధికార బృందాలు అందరూ ఇజ్రాయిల్‌ సాగిస్తున్న దాడిని సమర్ధిస్తున్నారు. విద్యార్థుల ఉద్యమాన్ని వ్యతిరేకిస్తున్నారు.
తక్కిన సామ్రాజ్యవాద దేశాలలో కూడా ఇటువంటి విద్యార్థి నిరసనలే తలెత్తాయి. అక్కడ కూడా చాలా క్యాంపస్‌లలో వారి మీద దమనకాండకు పూనుకున్నారు. బ్రిటిష్‌ ప్రధాని రిషి సునాక్‌ యూనివర్శిటీల వైస్‌ ఛాన్స్‌లర్లకు పోలీసులను దింపమని, విద్యార్థుల నిరసనలను అణచివేయమని సలహా ఇచ్చాడు. ఐతే, కొందరు వైస్‌ చాన్స్‌లర్లు ఇందుకు బాహాటంగానే వ్యతిరేకించారు. అతడు పిలిచిన సమావేశానికి కొందరు హారజరయ్యారు కూడా. కాని అమెరికాలో అటువంటి వ్యతిరేకత ఎక్కడా తలెత్తలేదు. విద్యార్థుల నిరసనల పట్ల తమ స్వంత పద్ధతుల్లో వ్యవహరించడానికి పూనుకున్న కొందరు అధికారుల చేత బలవంతంగా రాజీనామాలు చేయించారు.
ఈ మాదిరిగా యూనివర్సిటీ క్యాంపస్‌లలో భావ ప్రకటన స్వేచ్ఛను అణచివేసే ప్రయత్నాలు చూస్తుంటే అమెరికాలో ఒక కొత్త తరహా మెకార్థీయిజం విజృంభిస్తోందా? అని భావించాల్సి వస్తోంది. గతంలో మాదిరిగానే ఇప్పుడు కూడా అధికారంలో ఉన్న మితవాద నాయకులు క్యాంపస్‌లలో స్వతంత్ర భావాలు తలెత్తకుండా అణచివేయడానికి ప్రయత్నిస్తున్నారు. 1950 దశకంలో మెకార్ధీయిజం తలెత్తినపుడు దాని వెనుక ప్రేరణగా ప్రచ్ఛన్న యుద్ధం, కమ్యూనిజం అంటే భయం పనిచేశాయి. ఇప్పుడీ కొత్త తరహా మెకార్థీయిజం వెనుక పని చేస్తున్నవి ఏమిటి?
నయా ఉదారవాద పెట్టుబడిదారీ వ్యవస్థలో తలెత్తిన సంక్షోభం నేపథ్యంలో పెట్టుబడిదారీ దేశాల్లో నయా ఫాసిస్టు శక్తులు, మితవాద శక్తులు బలం పుంజుకున్నాయి. కొత్తతరహా మెకార్దీయిజం ఈ శక్తులతో ప్రత్యక్షంగా పెనవేసుకుని ఉంది. ఇంతకాలం రాజకీయ అధికార కేంద్రాలకు ఎడంగా పక్కకు నెట్టబడివున్న ఫాసిస్టు శక్తులను అధికార కేంద్రంలోకి నయాఫాసిజం తీసుకొచ్చింది. అంతేగాక ఈ శక్తులు ‘ఉదారవాద’ రాజకీయ శక్తుల మీద కూడా పెత్తనం చేయగలిగేట్టు చేసింది. ఆ విధంగా ఒక ఏకీకృతమైన మితవాద కూటమిగా తయారై వామపక్ష శక్తులు మళ్లీ పుంజుకోకుండా వారి ప్రయత్నాలను దెబ్బ తీయడానికి తయారయ్యాయి.
బ్రిటన్‌లో జెరిమీ కార్బిన్‌ లేబర్‌ పార్టీ నాయకుడిగా ఎన్నికైనప్పుడు అతడు అధికార వ్యవస్థను సవాలు చేశాడు. అప్పుడతనికి వ్యతిరేకంగా కుట్ర పన్నారు. అతడు యూదు వ్యతిరేకి అని ప్రచారం చేశారు. పాలస్తీనా ప్రజలకు అతడు మద్దతు తెలపడమే దీనికి కారణం. ఆ తర్వాత అతడిని ఏకంగా లేబర్‌ పార్టీ నుంచి బహిష్కరించారు.
సామ్రాజ్యవాద దేశాలలోని యూనివర్సిటీలలో విద్యార్థులు, అధ్యాపకులు ఇప్పటికీ స్వతంత్ర భావాలకు కేంద్రంగా ఉన్నారు. వారి నైతిక బలంతో మితవాద కూటమికి ఒక సవాలుగా మారారు. అందుచేత మితవాద శక్తుల కూటమి మరింత బలపడాలంటే సవాలును ఎదుర్కోవడం ఒక ముఖ్యమైన అంశంగా ముందుకొచ్చింది. అన్ని రకాల స్వతంత్ర భావాలనూ నాశనం చేయాలి. మానవత్వపు ఛాయలన్నింటినీ మంటగలపాలి. అప్పుడే ఈ మితవాద కూటమి ఆధిపత్యం తిరుగులేనిదిగా కొనసాగుతుంది. అమెరికాలో మనం చూస్తున్నది ఇదే. భావ ప్రకటనా స్వేచ్ఛను బరితెగించి నాశనం చేస్తున్నారు.జాతి హననం జరుగుతున్నప్పుడు దానిని వ్యతిరేకిస్తే దానికి ‘యూదు వ్యతిరేకత’ అని ముద్ర వేస్తున్నారు. ఇప్పుడు నిరసనలు తెలుపుతున్న విద్యార్థులు కాని, జెరిమీ కార్బిన్‌ కాని వాస్తవానికి యూదు వ్యతిరేకులు కారు. నిజానికి వారిని విమర్శిస్తున్న వారికే నాజీలతో కుమ్మక్తై వ్యవహరించిన చరిత్ర ఉంది. (యూదుల పట్ల అమిత ద్వేషాన్ని ప్రదర్శించి వారిని ఊచకోత కోసింది నాజీలే) కాని తమ వ్యతిరేకుల మీద అభాండాలు మోపి వారి ఉద్యమాల మీద బురద జల్లడానికి ఈ ‘యూదు వ్యతిరేకులు’ అన్న ఆరోపణ పనికొస్తోంది.
ఈనాడు అమెరికన్‌ యూనివర్సిటీల క్యాంపస్‌లలో జరుగుతున్న ఘటనలకు చాలా ప్రాధాన్యత ఉంది. అక్కడ ఇప్పుడు మోసకారితనానికి, మానవత్వానికి జరుగుతున్న పోరాటం రాబోయే కాలంలో నిర్ణయించే వర్గ పోరాటానికి నాంది కాగలదు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular