ద్రోణ న్యూఢిల్లీ ప్రతినిధి
సుప్రీం కోర్టు భవనాన్ని కూల్చవద్దని కేంద్ర ప్రభుత్వంతోపాటు కోర్టు రిజిస్ట్రేషన్ కి ఆదేశాలివ్వాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానం లో పిటిషన్ దాఖలైంది.భారీ కట్టడాన్ని కూల్చివేసే బదులు వేరే చోట కొత్త భవనాన్ని నిర్మించాలని పిటిషనర్ అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న భవనాన్ని ఇతర అవసరాలకు వాడుకోవచ్చని అభిప్రాయపడ్డారు.
”స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో నిర్మించిన ముఖ్యమైన కట్టడాల్లో సుప్రీం కోర్టు ఒకటి. దీన్ని కూల్చివేస్తే చరిత్రలో ఒక భాగాన్ని నాశనం చేసినట్లే అవుతుంది. ప్రస్తుతం అద్దె ప్రాతిపదికన ప్రైవేటు ప్రాంతాల్లో కొనసాగుతోన్న అనేక కోర్టులు, ట్రైబ్యునళ్లు, ప్రభుత్వ కార్యాలయాలకు ఇక్కడ వసతి కల్పించవచ్చు’ అని పిటిషనర్ పేర్కొన్నారు. ఇప్పటివరకు కొత్త భవనానికి సంబంధించిన నమూనాను కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయలేదని, ప్రజలతో పాటు బార్ అసోసియేషన్‌లతోనూ దీనిపై చర్చించలేదన్నారు.
”ప్రస్తుతం 17 కోర్టు రూమ్‌లు, రెండు రిజిస్ట్రేషన్ రూమ్‌లు ఉన్నాయి. ఈ మొత్తం భవనాన్ని కూల్చివేసి రూ.800 కోట్లతో కొత్త భవనం నిర్మించాలని యోచిస్తున్నారు. ఇందులో 27 కోర్టు రూమ్‌లు, నాలుగు రిజిస్ట్రేషన్ రూమ్‌లు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. సుప్రీం కోర్టులో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నందున పదేళ్ల తర్వాత ఇవి కూడా సరిపోవు” అని కేకే రమేష్ అనే వ్యక్తి తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
