వారసత్వ ఉద్యోగాలు, ఖాళీల్లో సర్దుబాటు అంశాలపై దృష్టి
ద్రోణ హైదరాబాద్ ప్రతినిధి
సమస్యలపై చర్చించిన పరిష్కార కమిటీ హైదరాబాద్ వివిధ కారణాలతో పోస్టింగ్‌లు రాక, 61 ఏళ్లు పైబడిన వారి వారసులకు ఉద్యోగాల కల్పనకు సంబంధించి స్పష్టత లేకపోవడం.. తదితర సమస్యలతో ఇబ్బందులు పడుతున్న గ్రామ రెవెన్యూ సహాయకు(వీఆర్‌ఏ)ల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రభుత్వం నియమించిన వీఆర్‌ఏల సమస్యల పరిష్కార కమిటీ దృష్టి సారించింది. వారి సమస్యలపై ఈ ఏడాది ఫిబ్రవరిలో రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన ఐదుగురు సభ్యులతో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సోమవారం రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ అధ్యక్షతన కమిటీ సమావేశమై పలు అంశాలపై చర్చించింది.సమస్యలపై అధ్యయనం.రాష్ట్రంలో వీఆర్‌ఏలుగా పనిచేస్తున్న 20,555 మంది ఉద్యోగాలను గతేడాది భారాస ప్రభుత్వం క్రమబద్ధీకరించి, వారిని ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేసింది. అందులో 61 ఏళ్లు పైబడిన దాదాపు 4 వేల మందిని మాత్రం బదలాయించలేదు. రెవెన్యూ నుంచి కేటాయించిన వీఆర్‌ఏలను కొన్ని శాఖలు పూర్తి స్థాయిలో చేర్చుకోలేదు. పోస్టింగుల్లో భాగంగా నిబంధనలకు విరుద్ధంగా పలువురిని దూర ప్రాంతాలకు పంపడం, ఆయా శాఖల్లో చేరిన వారికి ఇప్పటికీ జీతభత్యాలు రాకపోవడం వంటి తదితర విషయాలపై ఈ కమిటీ అధ్యయనం చేపట్టింది. ప్రభుత్వం కొత్తగా జారీ చేయాల్సిన ఉత్తర్వులు తదితర అంశాలపై కూడా కమిటీ చర్చించింది. త్వరలో ప్రభుత్వానికి నివేదికను పంపాలని భావిస్తోంది. ఆ నివేదిక ప్రకారమే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలు ఉన్నాయి.
సర్దుబాటు కాని వారిని రెవెన్యూలోకి తీసుకోవాలి రేసా, వీఆర్‌ఏ వ్యవస్థ రద్దు, ఉద్యోగ క్రమబద్ధీకరణ అనంతరం ఇతర శాఖల్లో సర్దుబాటు కాని వీఆర్‌ఏలను రెవెన్యూ శాఖలోకి తీసుకోవాలని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం (ట్రెసా) వీఆర్‌ఏ సమస్యల పరిష్కార కమిటీని కోరింది. కమిటీ ఛైర్మన్, రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్‌ను ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతంకుమార్, ఉపాధ్యక్షుడు నిరంజన్ సోమవారం హైదరాబాద్‌లో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగ క్రమబద్ధీకరణ అనంతరం ఇతర శాఖల్లోకి వెళ్లిన పలువురు వీఆర్‌ఏలు తిరిగి రెవెన్యూశాఖలోకి వచ్చేందుకు సుముఖంగా ఉన్నారని తెలిపారు.
