Saturday, February 21, 2026

విప్లవ వేగుచుక్కచేగువేరా జన్మదినంనేడు

ద్రోణ న్యూఢిల్లీ ప్రతినిధి

తన ప్రియురాలు పెద్ద ధనవంతురాలు.
తనను విందుకు ఇంటికి పిలిచినప్పుడు,
మాసిన బట్టలతో, చింపిరి గడ్డం,జుట్టుతో ఆ పెద్ద బంగ్లాలోనికి వెళ్ళాడు.
బట్టలు విడిచి టవల్ కట్టుకుని తానే ఆ బట్టలను ఉతికి ఆరబెట్టి తిరిగి వేసుకున్నాడు.
ధనవంతులైన ఆమె తల్లిదండ్రులు ఆయన పేదరికాన్ని చూసి ఛీదరించుకున్నారు, అసహ్యించుకున్నారు. ఆమెను తిట్టి చివాట్లు పెట్టినా ఏమాత్రం పట్టించుకోలేదు ఆమె.
కొద్దిసేపటికి ప్రియుడు భోజనం చేస్తూ ఆమెతోటి జరిపిన సంభాషణ, ప్రపంచపోరాటాలు, దేశసమస్యలు, పరిష్కారమార్గాలు, తనకర్తవ్యాలు తెలియచేయడం చూసి ఆమె తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు.
తమ కంటే తన కూతురు ఉన్నతంగా ఆలోచించిదని, తాము పైకి కనపడే అందాన్ని మాత్రమే చూసాము తప్ప తన కుతురులా లోపలున్న మంచి మనసుని ఆలోచనల్ని చూడలేకపోయాం అని అనుకున్నారు.
ప్రపంచాన్నే ఈ విధంగా ప్రేమిస్తే తన కూతురిని ఇంకెలా ప్రేమిస్తాడో అని ఆశ్చర్యపోయి మనసులో ఆనందపడ్డారు.

చేగువేరా

విప్లవవేగుచుక్కచేగువేరాజన్మదినంనేడు అన్యాయాలకు, దోపిడీలకు ఎల్లలు లేవు కావున వాటి అంతం కొరకు పోరాడే విప్లవకారులకు కూడా ఎల్లలు ఉండకూడదు అని చాటిన గొప్ప విప్లవకారుడు “చే” వ్యక్తికి పట్టిన వైరస్ ని చంపడం కన్నా సమాజానికి పట్టిన వైరస్ ని చంపడం మిన్న అని భావించి తన డాక్టర్ వృత్తిని వదిలి విప్లవోద్యమంలో చేరిన విప్లవ కెరటం “చే” నేడుచే_91 జన్మదినం
ఈ సందర్భంగా ఆయన గురించి మరింత సమాచారం…
చే గువేరా పేరు విన్పిస్తే నరనరాల్లో చైతన్యం ప్రవహిస్తుంది. యుద్ధానికి సిద్ధమన్నట్టు వెన్నెముక నిటారై, చేగువేరా..! చేగువేరా..!! అని హృదయం కలువరిస్తుంది. కవి ‘అరుణ్‌ సాగర్‌’ అన్నట్టు ‘చే’ ను గుండెల మీద ధరిస్తే ఛాతీ ఉప్పొంగుతుంది. దేహం నిలువెల్లా అణువణువూ నిప్పు రవ్వై వెలిగిపోతుంది. అందుకే నెత్తుటికి బ్రాండ్‌గానే కాదు, నేటి పోరాటాలకు ఆయన ఛాయాచిత్రం అపురూప చిహ్నమై రెపరెపలాడు తున్నది. అందుకే చే అంటే తెలిసినా తెలియకపోయినా.. ఈ తరం మనసుల్లో ఫ్యాషన్‌ అయ్యి ప్రవహిస్తుండు. తను లాటిన్‌ అమెరికా అంతటా మోటర్‌సైకిల్‌ యాత్రతో సమస్యలను అధ్యయనం చేశాడని వారికి తెలియకపోవచ్చు. అయినా కానీ, నేడు ప్రతి బైక్‌పైన, కార్‌పైన, ఆటోలపైనా కూడా తను ఓ లోగో అయి ప్రకాశిస్తున్నాడు. టీషర్ట్స్‌, బ్యాగ్స్‌, కర్చీఫ్ప్‌, ఇలా ఒకటేమిటి ప్రతి వస్తువుమీద చే ఒక అందమై, ఆనందమై, అభిమానమై, ప్రేమై స్నేహమై ఓ ఉత్తుంగ తరంగమై ఉరకలేస్తున్నాడు. ప్రతి హృదయంలో విహరిస్తున్నాడు. ఇంత గొప్ప మనిషిని పెట్టుబడిదారులు వ్యాపారం కోసం వాడుకుంటున్నారన్న విషయం మనం మరువరానిదే. అయినప్పటికీ చాలామంది కావాలని కోరుకుని తమ వాహనాలపై చేగువేరా లోగో ముద్ర.. వేయించు కుంటున్నారు. తమకు తెలియకుండానే ఒక తిరుగుబాటు బావుటా ఎత్తుకుని తిరుగుతున్నారు. ఇక తెలుగు సినిమా తెరలపై కూడా వెలుగులీనుతున్నాడు. ఎల్లలు దాటి, సముద్రాలు దాటి, సరిహద్దులు దాటి, ఖండాలుదాటి, మనలో ఒకడిగా లీనమైన ఈ చేగువేరా అసలు ఎవరు?!
1928 జూన్‌ 14న అర్జెంటీనా దేశంలోని రొసారియా పట్టణంలో జన్మించి బ్యూనాస్‌ ఎయిర్స్‌ యూనివర్శిటీలో మెడిసిన్‌ పూర్తిచేసిన అనతికాలంలోనే లాటిన్‌ అమెరికా తిరిగి అక్కడున్న ప్రజలందరి బతుకులు మార్చడంకోసం ఏ వైద్యం చేయగలం, ఏ మెడిసిన్‌ ఇవ్వగలం అంటూ మదనపడుతున్న సమయంలోనే 1955 మెక్సికోలో క్యూబా ప్రవాస విప్లవకారుడు ఫైడల్‌కాస్ట్రోతో పరిచయం ఏర్పడింది. క్యూబా విప్లవంలో డాక్టర్‌గా చేరాడు. దోపిడీకి గురవుతున్న ప్రజలకు విప్లవాత్మక మెడిసిన్‌ అవసరమని భావించి విప్లవకారుడిగా పరిణితి చెంది విప్లవ గెరిల్లా దళానికి నాయకుడయ్యాడు. క్యూబా స్వాతంత్య్రం కోసం అస్తమా వ్యాధిని సైతం లెక్కచేయకుండా చే నిజమైన గెరిల్లా నాయకుడయ్యాడు.
1959లో ఆవిష్కృతమైన స్వాతంత్య్ర క్యూబాలో చేగువేరా పరిశ్రమల మంత్రిగా, జాతీయ బ్యాంకు అధ్యక్షుడిగా, ప్రణాళిక సంఘం అధ్యక్షుడిగా, రక్షణ కేంద్రాల అధిపతిగా, ఆర్థిక, మైత్రీ బృందాల సభ్యులుగా ఎన్నో బాధ్యతలు తన 39 ఏండ్ల ప్రాయంలోనే నిర్వహించాడు. అయితే తన కాలం కంటే ముందున్నవారు దార్శనికులు, అందరి అభిమానాన్నీ చూరగొన్నవారు అగ్రనాయకులు, సవాళ్లూ సమరాల్లో ముందున్నవాళ్ళు సాహసికులు అంటారు. ఈ మూడింటికీ చేగువేరా అచ్చుగుద్దినట్టు సరిపోతాడు. అయినప్పటికీ నిరంతర సాహసికుడిగానే వెలుగొందుతుంటాడని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఎన్ని పదవులున్నప్పటికీ అన్నింటినీ వదిలేసి తను అత్యంత ఇష్టపడే స్నేహితుడు కాస్ట్రో, క్యూబా ప్రజలకూ 1965లో వీడ్కోలు పలికి ఎన్నో దేశాలు తిరిగాడు. సైనిక ప్రభుత్వం చేత ఎంతో ఘోరంగా పీడింపబడుతున్న బొలీవియా దేశ ప్రజలను విముక్తం చేసే బాధ్యతను భుజానికేసుకుని కమ్యూనిస్టు గెరిల్ల్లా దళాన్ని స్వయంగా తయారు చేసుకుని విప్లవోద్యమాన్ని నిర్మించి నాయకత్వం వహించాడు. తన విప్లవ గెరిల్లా మేధస్సుతో పరిమితమైన యాభైమంది గెరిల్లాలతో 1800మంది కల్గిన బొలీవియా నియంత సైన్యాలను గడగడలాడించాడు. ఆ క్రమంలోనే దుర్మార్గమైన అమెరికా సిఐఎ ఆయుధ సంపత్తంతా రంగంలోకి దిగి 1967 అక్టోబర్‌ 9న బొలీవియా పర్వతశ్రేణుల్లో నుంచి చేగువేరా పయనమై.. చే ప్రపంచమంతా విప్లవోద్యమాన్ని నిర్మించాలన్న ఆయన ఆలోచనను తట్టుకోలేక అమెరికా సామ్రాజ్యవాదులు కుట్రపన్ని చే ను అంతమొందించారు.
అయినా అమెరికాకు ఆశాభంగం తప్పలేదు. తత్ఫలితంగానే చేగువేరా నేల నలుదిక్కులా పయనించాడు. ప్రజల నరాల్లో చైతన్యమై ప్రవహించాడు. రగిలే అగ్నికణమయ్యాడు.
చేగువేరా జీవిత చరిత్ర వందభాషల్లోకి అనువాదమైంది.
లాటిన్‌ అమెరికా నుంచి యూరప్‌ ఖండం వరకు, ఆసియా ఖండం నుంచి ఆఫ్రికా ఖండం వరకు జరిగే ప్రతీ ఉద్యమ చిహ్నం చే రూపమే. యుద్ధం… యుద్ధం… అని ఊగిపోతున్న అనేకమందికి 1964లో ఐక్యరాజ్యసమితి సదస్సులో చే మాట్లాడిన మాటలు కనువిప్పు కల్గిస్తాయి. ఈ నేల మీద జరిగే ప్రతి యుద్ధం మాటున అమెరికా సామ్రాజ్యవాదుల ప్రోత్సాహం, ప్రొద్బలం వుంటుంది. అది మామూలు సందర్భాల్లో చేసుకునే వ్యాపారం కంటే వెయ్యి రెట్లు ఎక్కువ వ్యాపారం యుద్ధ సమయంలో చేసుకుంటుంది.
సహజ వనరులు, దేశ సంపద దోపిడీ ఎక్కువగా జరుగుతుంది.ఫక్తు వ్యాపార దృష్టితోనే శ్వేతసౌధం యుద్ధాలను ప్రేరేపించి ఆయుధాలు అమ్ముకుంటోంది.
ప్రవంచ దేశాలన్నింటా శాంతి సహజీవనం సాగించాలనే మార్స్కిస్టులుగా మేము ప్రపంచశాంతిని ప్రేమిస్తాం.
అందుకే అమెరికా కుట్రల కవ్వింపు చర్యల్లో పడి మూడో ప్రపంచ దేశాలు తమని మృత్యు కుహరంలోకి నెట్టుకోవద్దు.అని చెప్పిన విషయాన్ని మన దేశ పౌరులతోపాటు పాలకులు కూడా గమనించాల్సిన అవసరం నేడున్నది.
చావుకు ఎన్నడూ భయపడని మహౌన్నత వ్యక్తిత్వం చేగువేరాది.
చావునోట్లోకెళ్ళి చావునే చీల్చి చెండాడిన ధీరోదాత్తుడు.
అందుకే ప్రపంచంలో ఎక్కడ పోరాటం జరుగుతుందో అక్కడ సమాజాన్ని మరింత ఎరుపెక్కించడం కోసం పోరాడి చనిపోవడమే అరుదైన గౌరవం అంటాడు. ఆ నేపథ్యంలోనే మార్క్స్‌ కోరిన అంతర్జాతీయ విప్లవకారుడు, ధిక్కార స్వరం జాషువా అన్న విశ్వనరుడు చేగువేరా..! అయ్యాడు.
కాబట్టే చే ఇవాళ ప్రపంచ యువతకు ఐకాన్‌ అయ్యాడు.
ఆడా మగా అన్న తేడాలేకుండా అందరి గుండెల్లో స్ఫూర్తి నింపుతున్నాడు.
చే అంటే ఎవరో తెలియకుండానే ఫ్యాషన్‌గా స్వీకరించినోడు రేపైనా, ఆ పైనెప్పుడైనా చేగువేరా గురించి తెలుసుకో కుండా వుండలేడు.
అలా తెలుసుకున్న నాడు, తెలుసుకున్నవారు ఇక మీదట వారిలా వుండలేరు. అన్యాయాన్ని అణుమాత్రం కూడా సహించలేని గుణం వారిని ఆవహిస్తుంది. వారు అనుక్షణం ప్రశ్నిస్తూ పయనిస్తుంటారు.
మోకాళ్ళ మీద కూర్చొని వున్నవారు కూడా అబద్ధంపై, అన్యాయంపై నిటారుగా నిలబడి కలబడతారు.
అలా చేసినప్పుడే వారు చేగువేరా మిత్రులవుతారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular