సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు

ద్రోణ హైదరాబాద్
హైదరాబాద్ లోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో ప్రసంగించిన సిర్పూర్ శాసనసభ్యులు డా.పాల్వాయి హరీష్ బాబు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండల కేంద్రానికి చెందిన చిన్నారిని పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ వద్ద దారుణంగా అత్యాచారం చేసి చంపిన ఘటన లో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతుందని దుయ్యబట్టారు. వేరే రాష్ట్రాల నుంచి కూలీలుగా పనిచేయడానికి వచ్చిన వారి సమాచారాన్ని సేకరించడంలో పోలీసులు విఫలమయ్యారని అన్నారు. గంజాయి మత్తులో నిందితుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడని, విచ్చలవిడిగా గంజాయి లభ్యం అవ్వడం కూడా రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి అనే విషయాన్ని తేట తెల్లం చేస్తుందని తెలిపారు.*
వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితునికి ఉరిశిక్ష విధించాలని, అలాగే బాధిత కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం, ఒక ప్రభుత్వ ఉద్యోగం మరియు ప్రభుత్వ ఇల్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.అలాగే రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల ప్రజలు పట్టణాలకు వలస వెళ్తున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేక, వ్యవసాయం లాభసాటిగా లేక వలస వెళ్లాల్సిన పరిస్థితి దాపురించిందని అన్నారు.ఈ చిన్నారి దుర్ఘటనలో సామాజిక మరియు ఆర్థిక కోణాలు కూడా దాగి ఉన్నాయని, వలసలను అరికట్టడంలో ప్రభుత్వం విఫలం అవుతోందని అన్నారు.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డా.శిల్పారెడ్డి, సిర్పూర్ జడ్పిటిసి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
