Saturday, February 21, 2026

ధరణి దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచండి

అర్హులైన రైతులందరికి ప్రయోజనం చేకూర్చాలి

అధికారులకు ఎమ్మెల్యే, కలెక్టర్ దిశానిర్దేశం

ద్రోణ నిజామాబాద్, జూన్ 21 ధరణి దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేసి, అర్హులైన ప్రతి రైతుకు ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలని బోధన్ నియోజకవర్గ శాసన సభ్యులు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు దిశానిర్దేశం చేశారు. బోధన్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని ఆయా మండలాలలో ధరణి పెండింగ్ దరఖాస్తులపై శుక్రవారం బోధన్ పట్టణంలోని ఇరిగేషన్ గెస్ట్ హౌస్ లో కలెక్టర్ తో కలిసి ఎమ్మెల్యే సంబంధిత రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఒక్కో మండలం వారీగా ఆయా మాడ్యూల్స్ లో పెండింగ్ లో ఉన్న ధరణి దరఖాస్తులపై చర్చించారు. వాటి పరిష్కారానికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు కలెక్టర్ సూచనలు చేశారు. తహసీల్దార్లు తమ లాగిన్ లో ఏ ఒక్క ధరణి దరఖాస్తు సైతం పెండింగ్ లో ఉండకుండా నాలుగు రోజుల వ్యవధిలోపు అన్నింటిని పరిష్కరించాలని ఆదేశించారు. మ్యుటేషన్, సక్సేషన్, నాలా కన్వర్షన్, ఖాతా మెర్జింగ్, పాస్ పుస్తకాలలో డేటా కరెక్షన్, టీఎం-33 తదితర అంశాలకు సంబంధించిన దరఖాస్తులను తహసీల్దార్లు స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన జరపాలన్నారు. ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా వాస్తవ పరిస్థితులతో కూడిన నివేదికను నిబంధనలకు అనుగుణంగా రూపొందించి ఆర్డీఓ లాగిన్ కు ఫార్వార్డ్ చేయాలని సూచించారు. దరఖాస్తుల సత్వర పరిశీలన కోసం అవసరమైతే అదనపు బృందాలను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ధరణి దరఖాస్తుల పరిష్కారానికి సంబంధించిన ప్రగతి గురించి రోజువారీగా నిశిత పరిశీలన జరపాలని బోధన్ ఆర్డీఓను ఆదేశించారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, రైతులకు బ్యాంకుల నుండి పంట రుణాలు పొందడంతో పాటు భూమి హక్కులు, ఇతరాత్ర అనేక అవసరాలకు పట్టా పాస్ పుస్తకాలు ఆవశ్యకంగా మారాయని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ధరణి ద్వారా దరఖాస్తులు చేసుకున్న రైతుల అర్జీలను వెంటదివెంట పరిశీలిస్తూ అర్హులైన వారికి ప్రయోజనం చేకూరేలా చొరవ చూపాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అప్పుడే అటు ప్రభుత్వానికి, ఇటు అధికారులకు మంచి పేరు వస్తుందన్నారు. బోధన్ నియోజకవర్గం పరిధిలో 10,013 దరఖాస్తులు రాగా, ఇప్పటికే 8592 దరఖాస్తులు పరిష్కరించారని తెలిపారు. పెండింగ్ లో ఉన్న మిగతా 1421 దరఖాస్తులను సైతం వేగవంతంగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. బోధన్ నియోజకవర్గం పరిధిలో అర్హత కలిగిన ఏ ఒక్క రైతు కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతోనే దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయించేందుకు కలెక్టర్ ను ఆహ్వానించి రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని మాడ్యూల్స్ లో దాఖలైన ధరణి దరఖాస్తులను నాలుగైదు రోజుల్లోపు క్లియర్ చేయాలని అధికారులకు గడువు విధించారు. సమీక్షలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్, ఆయా మండలాల తహసీల్దార్లు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సర్వేయర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular