బాపట్ల జిల్లాకు చెందిన గోపికృష్ణ మృతి
ద్రోణ న్యూఢిల్లీ ప్రతినిధి
అమెరికాలో దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలుగు యువకుడు మృతిచెందాడు. మృతుడిని ఏపీలోని బాపట్ల జిల్లాకు చెందిన దాసరి గోపీకృష్ణ (32)గా గుర్తించారు.
కర్లపాలెం మండలం యాజలికి చెందిన గోపీకృష్ణ జీవనోపాధి కోసం 8 నెలల క్రితం అమెరికా వెళ్లాడు. ఆర్కెన్సాస్లోని ఓసూపర్మార్కెట్లో పనిచేస్తున్నాడు.శనివారం మధ్యాహ్నం గోపీకృష్ణ కౌంటర్లో ఉండగా.. ఓ దుండగుడు నేరుగా వచ్చి తుపాకీతో అతడిపై కాల్పులు జరిపాడు. తీవ్రగాయాలతో గోపి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
అనంతరం దుండగుడు ఓ వస్తువు తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు.
ఆ తర్వాత గోపీకృష్ణను ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయాడు. ఈ సమాచారం తెలియడంతో అతడి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. గోపి స్వగ్రామం యాజలిలో విషాదఛాయలు అలముకున్నాయి.
మరోవైపు దుండగుడు కాల్పులు జరిపిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
