Saturday, February 21, 2026

నేడు తెలంగాణ సీఎం ఢిల్లీకి

ద్రోణ హైదరాబాద్‌ ప్రతినిధి

పార్లమెంట్‌ సభ్యుల ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దిల్లీ వెళ్లనున్నారు. సోమవారం, మంగళవారం దిల్లీలో ఉండనున్న సీఎం.. పార్టీ పెద్దలతో సమావేశం కానున్నారు. మంత్రిమండలి విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక తదితర అంశాలపై చర్చించే అవకాశముంది. పార్లమెంట్‌లో ప్రస్తావించాల్సిన రాష్ట్రానికి చెందిన అంశాలపై ఎంపీలకు సీఎం దిశా నిర్దేశం చేయనున్నారు.
లోక్‌సభ ఎన్నికలు ముగిసి పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి త్వరలోనే మంత్రివర్గాన్ని విస్తరించనున్నట్లు తెలిసింది. దీనిపై ఏఐసీసీ ముఖ్య నాయకులతో ఇప్పటికే చర్చించినట్లు సమాచారం. ఈ నెలాఖరుకు లేదంటే జులై మొదటి వారంలో విస్తరణ ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి కాకుండా మరో 11 మంది మంత్రివర్గంలో ఉన్నారు. సీనియర్‌ నాయకులు, ముఖ్యులు, శాసనసభ ఎన్నికలకు ముందు పార్టీలో చేరిన వారికిచ్చిన హామీలను పరిగణనలోకి తీసుకోవడంతో కొన్ని జిల్లాలకు ఎక్కువ ప్రాతినిధ్యం దక్కగా, కొన్ని జిల్లాలకు అసలు చోటే లభించలేదు. మరోవైపు భారాస నుంచి ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలు వచ్చి చేరగా, మరికొందరు చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా మరో ఆరుగురిని కొత్తగా మంత్రివర్గంలోకి చేర్చుకోవచ్చు. ప్రస్తుతం నలుగురికి అవకాశం ఉండొచ్చని విశ్వసనీయవర్గాల సమాచారం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular