ద్రోణ హైదరాబాద్ జూన్ 24
తెలంగాణలో మళ్లీ హస్తం షో మొదలయింది. ఫస్ట్ సీజన్‌లో ముగ్గురు బీఆర్ ఎస్, ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్న ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.
తాజాగా సెకండ్ సీజన్‌ను స్టార్ట్ చేశారు. మాజీ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పార్టీని వీడడంతో ఇప్పటికే షాక్ మీదున్న బీఆర్‌ఎస్‌కు, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ మరో షాక్ ఇచ్చారు. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ గూటికి చేరిపోయారు.సంజయ్‌కు సీఎం రేవంత్ రెడ్డి,కండువా కప్పి పార్టీలో కి ఆహ్వానించారు. బీఆర్ ఎస్ నుంచి రెండు సార్లు బరిలో దిగిన సంజయ్.. రెండు సార్లూ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిపై గెలుపొందారు. కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితకు సన్నిహితంగా మెలిగే సంజయ్, ఇలాంటి ట్విస్ట్ ఇస్తారని బీఆర్ఎస్ శ్రేణులు ఊహించలేదు. పోచారం శ్రీనివాస్ రెడ్డి చేరికపై బహిరంగంగా వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన రోజునే తన ప్రత్యర్థి అయిన సంజయ్, కాంగ్రెస్ పార్టీలో చేరటం ఆసక్తి రేపుతోంది. సంజయ్ చేరికతో కాంగ్రెస్ లో చేరిన బీఆర్‌ఎస్ ఎమ్మె ల్యేల సంఖ్య ఐదుకు చేరింది.
బీఆర్‌ఎస్‌కు చెందిన దానం నాగేందర్, పోచారం శ్రీనివా స్‌రెడ్డి, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, సంజయ్ కారుకు గుడ్‌బై చెప్పి, హస్తం పార్టీలో చేరిపోయారు.
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయ భీష్ముడిగా పేరొందిన జీవన్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా స్వరాష్ట్ర కల సాకారం కాకముందు నుండి పావులు కదుపుతున్నారు. 2014లో ఓటమి చవి చూసి నప్పటికీ ఆ తరువాత రెండు ఎన్నికల్లో కూడా తన పంథాన్ని నెగ్గించుకున్నారు కవిత. 2018, 2023 ఎన్నికల్లో జగిత్యాల నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత టి జీవన్ రెడ్డిపై గెలిచి న డాక్టర్ ఎం సంజయ్ ఎవరు ఊహించని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఎవరెవరు కాంగ్రె స్ పార్టీలో చేరుతున్నారన్న చర్చల్లో ఎక్కడా కూడా డాక్టర్ సంజయ్ పేరు వినిపించలేదు. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత మాజీ మంత్రి గంగుల కమలాకర్ పేరు ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది. అయితే అందరి అంచనాల ను తలకిందులు చేస్తూ, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆదివారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం సంచలనంగా మారింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫ్యామిలీకి సన్నిహితునిగా, సౌమ్యునిగా ముద్రపడ్డ డాక్టర్ సంజయ్ పార్టీ ఫిరాయించడం సరికొత్త చర్చకు దారి తీసింది.
