ద్రోణ న్యూ ఢిల్లీ ప్రతినిధి
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ అనిశ్చిత పరిస్థితులు ఎదురవుతాయన్న దుష్ప్రచారాలు కొన్ని రాజకీయ పార్టీల వారు చేస్తున్నారు. రాజకీయాల్లో ఎత్తుకు పైఎత్తులు వేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ సమీకరణాలు వేగవంతం చేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో 65 శాసనసభ స్థానాలను గెలుచుకొని అధికార పీఠాన్ని దక్కించుకోగలిగింది. పదేళ్లపాటు అధికారంలో ఉన్న కేసీఆర్ 39 మంది ఎమ్మెల్యేలు గెలిపించుకోగలిగారు. బిజెపి, ఎంఐఎం చెరో ఏడు స్థానాలను దక్కించుకున్నారు. కాంగ్రెస్ పార్టీలోని పలువురు ఎమ్మెల్యేలు ఇతర పార్టీలతో టచ్ లో ఉన్నారంటూ రాజకీయ పార్టీల నాయకులు ప్రచారం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని కదిలించి తీరుతామని బహిరంగంగానే వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు ఇప్పటికే పలుమార్లు హెచ్చరిస్తూ వస్తున్నారు. శాసనసభ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి యుహాత్మకంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలో కి తేగలిగారు. కెసిఆర్ కన్న కలలను విఫలం చేశారు. అధికారాన్ని కోల్పోయిన గులాబీ అధిపతి, బిజెపి నేతలు రాబోయే రోజుల్లో జరగరాని అద్భుతాలు జరుగుతాయంటూ రేవంత్ రెడ్డిని ఇరకాటంలో పడేసే ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ బిజెపి చెరో 8 స్థానాలను దక్కించుకున్నారు. గులాబీ పార్టీ ఒక స్థానాన్ని కూడా దక్కించుకోలేకపోయింది. చాలా చోట్ల టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లను కోల్పోయారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాలతో గులాబీ పార్టీ నీరుగారిపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు పార్టీ వెంట ఉంటే రాబోయే రోజుల్లో తిరిగి రాష్ట్రంలో గులాబీ జెండా ఎగర వచ్చన్న అంచనాలతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పగటి కలలు కన్నారు. పదేళ్లపాటు అధికారాన్ని తెలంగాణ ప్రజలు కేసీఆర్ కు కట్టబెడితే ఆర్థిక పరిస్థితిని రాష్ట్రంలో దివాలా తీపించారని, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయారన్న అంశాలతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి కాంగ్రెస్ పార్టీలు హోరా హోరీగా తలపడ్డాయి. తెలంగాణ ప్రజలు ఎంతో తెలివిగా కాంగ్రెస్ బిజెపిలకు సరిసమాన న్యాయం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో కేంద్రంలో మోడీని సమర్థిస్తూ మరోపక్క రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సమర్థించారు. గులాబీ పార్టీకి తెలంగాణ ప్రజలు చెయ్యి ఇచ్చారు. గులాబీ దళపతికి ఆ పార్టీ నేతలకు పార్లమెంటు ఎన్నికలతో ఒక్కసారిగా దిమ్మ తిరిగింది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వారి మిత్రపక్షాలు దేశంలో బిజెపితో పోటా పోటీగా ఎన్నికల్లో తలపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ 232 పార్లమెంట్ స్థానాలను దక్కించుకొని కేంద్రంలో తమ స్థానాన్ని పదిల పరచుకున్నారు. బిజెపి మోడీ అంచనాల కూడా తారుమారు అయ్యాయి. చివరికి ఏదోరకంగా బిజెపి మిత్రపక్షలతో ఢిల్లీ పీఠాన్ని దక్కించుకొని మోడీ ప్రధాని కాగలిగారు. బిజెపి దేశంలో కొంత బలహీన పడటంతో రేవంత్ రెడ్డి మరింత ధైర్యాన్ని నింపుకొని తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగవంతం చేశారు.
బిఆర్ఎస్ కు చెక్ పెట్టడం
కుర్చీ కాపాడుకునే ప్రయత్నం
తెలంగాణ రాష్ట్రంలో మొదటి నుండి రేవంత్ రెడ్డి తన ప్రత్యేక ముద్ర వేసుకుంటూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది రాజకీయ ఉద్దండులు ఉన్నప్పటికీ కాంగ్రెస్ అగ్ర నేతలు రేవంత్ రెడ్డికి ఆనాడు పిసిసి పగ్గాలు అప్పగించారు. అంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్న దృఢ సంకల్పంతో రేవంత్ రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ నేతలు అందరిని ఏకతాటి పైకి తీసుకువచ్చి శాసనసభ ఎన్నికల్లో మెజార్టీ శాసనసభ్యులను కాంగ్రెస్ పార్టీ గెలుచుకోగలిగింది. ముఖ్యమంత్రి ఎంపికలోనూ ఏవో జిమ్మిక్కులు జరుగుతాయని ఆనాడు ఎంతోమంది ఊహాగానాలు వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఆది నాయకత్వం మాత్రం రేవంత్ రెడ్డి కే ముఖ్యమంత్రి పీఠం అంటూ ప్రకటన చేశారు. ఆనాటి నుండి నేటి వరకు ముఖ్యమంత్రి తన రాజకీయ చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ తనకన్నా ఎంతో మంది ఎన్నో ఏళ్ల నుండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరినీ కలుపుకుంటూ పాలన సాగిస్తూ పాలనలో తన ప్రత్యేకముద్రను వేసుకోగలిగారు. ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన నాటి నుండి బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు రేవంత్ కుర్చీ కింద నీళ్లు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. రేవంత్ రెడ్డి తన మనో ధైర్యాన్ని కోల్పోకుండా ఐదేళ్లు కాదు తెలంగాణలో పదేళ్లపాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందంటూ ప్రజల్లో మనోధైర్యాన్ని నింపుతూ వస్తున్నారు. గతంలో రేవంత్ గురించి వ్యతిరేకంగా మాట్లాడిన నేతల నోటి నుండే అనుకూలంగా మాట్లాడించగలిగారు. రాజకీయ చతరతను ప్రదర్శిస్తూ వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకుంటూ వస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందంటూ వివిధ పార్టీలకు చెందిన బడా నేతలు రోజుకో అద్భుతం జరగబోతుంది అంటూ ప్రజలను ఇరకాటంలో పెట్టే ప్రయత్నాలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి చెందిన 8 మంది ఎంపీలు గెలుపొందారు. గులాబీ పార్టీ ఒక్క స్థానాన్ని రక్షించుకోకుండా చతికిల పడింది. ఇదే అదునుగా భావిస్తూ ముఖ్యమంత్రి రాజకీయ సమీకరణాలు వేగవంతం చేశారు. గతంలో కేసీఆర్ అమలు చేసిన ఫార్ములాను రేవంత్ రెడ్డి అమలు చేసే ప్రయత్నంలో తల మునకలైఉన్నారు. బి ఆర్ ఎస్ పార్టీపై రేవంత్ గురిపెట్టి పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఆ పార్టీ చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. 65 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ బలం తెలంగాణ రాష్ట్రంలో 70 కి చేరింది. తన కుర్చీని ఎలా ఖాళీ చేస్తారో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారం నుండి దూరం ఎలా చేయగలుగుతారో చూద్దామన్న చందంగా రేవంత్ ముందుకు సాగుతున్నారు. గతంలో గులాబీ దళపతి కాంగ్రెస్ టిడిపి ల నుండి గెలుపొందిన ఎమ్మెల్యేలను గులాబీ పార్టీలో చేర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీని కథం చేస్తానని తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేసి చూపించి దేశంలోనే తన తడాఖాను చూపిస్తానని ధీమా వ్యక్తం చేసిన కేసీఆర్ ను మట్టి గరిపించే ప్రయత్నంలో రేవంత్ ఆ పార్టీ ఎమ్మెల్యేలకు ఏ రవేస్తున్నారు. గత మూడు రోజుల క్రితం బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో కి లాగారు. 40 ఏళ్ల నుండి సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తూ బాన్సువాడలో ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది తెలుగుదేశం, టిఆర్ఎస్ పార్టీలలో కొనసాగి ఆ పార్టీలు ఏర్పాటు చేసిన ప్రభుత్వాల్లో ప్రధాన భూమిక పోషించిన పోచారాన్ని రేవంత్ రెడ్డి తన రాజకీయ చతురతతో కాంగ్రెస్ గూటికి తీసుకు రాగలిగారు. గులాబీ దళపతికి పోచారం అతి సన్నిహితుడిగా మెలుగుతూ వచ్చారు. ఆ పార్టీలోని ప్రధానమైన ముఖ్యమైన నాయకులను బయటకు తీసుకు వచ్చి తమ పార్టీలో చేర్చుకొని కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశలో రేవంత్ రెడ్డి ప్రతినిత్యం తెలంగాణ లో అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే గులాబీ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరో 15 మంది కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. రేవంత్ రెడ్డికి దెబ్బ కొట్టాలన్న ప్రయత్నం చేసిన నేతలకు ఎదురు దెబ్బ కొట్టి తీరే ప్రయత్నంలో రేవంత్ రాజకీయాల్లో ఎత్తులకు పై ఏ త్తులు వేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఎదురులేని నేతగా చలామణి అయ్యే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఆయనతో పాటు ఆయన మంత్రివర్గంలో ఉన్న మంత్రులు సైతం ప్రతినిత్యం రాజకీయ పరిస్థితులను అంచనాలు వేసుకుంటూ ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. మంత్రివర్గ సహచరులు రేవంత్ కు పూర్తి సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రతినిత్యం రాజకీయ పరిస్థితులపై ప్రత్యేక నజర్ వేస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తీవ్ర కృషి చేస్తున్నారు. ఏది ఏమైనాప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఐదు ఏళ్లపాటు సుస్థిరంగా పరిపాలన కొనసాగిస్తుందన్న నమ్మకాన్ని ప్రజల్లో మాత్రం నింపగలిగారు. గులాబీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంతో ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. బాన్సువాడ నియోజకవర్గం లో పోచారం శ్రీనివాస్ రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు స్వయంగా ముఖ్యమంత్రి పోచారం ఇంటికి వెళ్లారు. పోచారం పార్టీ మార్పిడితో ఇరు పార్టీలో గందరగోళ పరిస్థితులు తలెత్తే యి. అయినప్పటికీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బలోపేతం, తన ముఖ్యమంత్రి సీటు కాపాడుకోవటమే ముఖ్యంగా భావిస్తూ ముందుకు సాగుతున్నారు. అధికారం కోల్పోతే కాంగ్రెస్ కార్యకర్తలు ఇబ్బందుల్లో పడతారని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడితేనే కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని, భావిస్తూ రాజకీయ సమీకరణలు కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు కార్యకర్తలు, సమయమానం పాటించి జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఓపికతో పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
