ఈ సీజన్ నుంచే ఇచ్చే యోచనలో ప్రభుత్వం
సబ్‌కమిటీలో చర్చించి విధి విధానాలు ఖరారు
రాష్ట్రంలో సుమారు 25 లక్షల కౌలు రైతులు
ఏ విధంగా గుర్తించాలనే దానిపై చర్చ
వారికి ఇవ్వడమెలా అంటూ
మల్లగుల్లాలు!
ద్రోణ హైదరాబాద్, జూన్ 26
కౌలు రైతులకు కూడా ఈ సీజన్ నుంచే రైతుభరోసా (రైతుబంధు) అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలిసింది. దీనిపై క్యాబినెట్ సబ్‌కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నది. రైతులతోపాటు కౌలు రైతులకు కూడా ఎకరాకు ఏడాదికి రూ.15 వేల చొప్పున పెట్టుబడిసాయం అందజేస్తామని కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొన్నది. అయితే, కౌలు రైతులను ఏ విధంగా గుర్తిస్తారనేది పెద్ద ప్రశ్నగా మారింది. రాష్ట్రంలో సుమారు 70 లక్షల మంది రైతులు ఉండగా, కౌలు రైతులు 25 లక్షల వరకు ఉంటారని కౌలురైతు సంఘాల నేతలు చెప్తున్నారు.
గ్రామ సభ ఆమోదం పొందాలి
కౌలు రైతులను ఎలా గుర్తిస్తారన్న ప్రశ్నపై.. 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన కౌలు రైతుల చట్టం ప్రకారం కౌలు రైతులను గుర్తిస్తామని ఎన్నికలకు ముందు రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఆనాడు కౌలు రైతులు రుణాలు పొందే రుణ అర్హత కార్డు (ఎల్‌ఈసీ) కోసం ఒక నిర్ణీత ఫార్మాట్ తీసుకొచ్చారు. కౌలుదారుకు ఇచ్చిన భూమి విస్తీర్ణంపై కౌలుదారు, యజమాని ఒప్పందంపై సంతకం చేయాలి. ఆ ఒప్పందం గ్రామ సభ ద్వారా ఆమోదం పొందాలి. ఆ తర్వాత కౌలు రైతులు ఎల్‌ఈసీ పొందేవారు. సీఎం రేవంత్ చెప్పిన దాని ప్రకారం.. ఇప్పుడు రైతు భరోసాకు కూడా ఆ పద్ధతినే అనుసరించాలి. భూమిని కౌలుకు ఇచ్చే యజమాని, కౌలుదారు ఒప్పందంపై సంతకం చేయాలి. ఆ ఒప్పందాన్ని గ్రామ సభ ఆమోదించాలి.
నమ్మకం కాదు.. చట్టబద్ధం కావాల్సిందే!
ప్రస్తుతం చాలామంది రైతులు నోటిమాట ద్వారా, పరస్పర నమ్మకాల ప్రాతిపదికగానే తమ భూములను కౌలుకు ఇస్తున్నారు. అయితే రైతు భరోసా కోసం కౌలుదార్లు చట్టపరంగా కౌలుకు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ చట్టం ప్రకారం కౌలు రైతులకు అనేక హక్కులు సంక్రమిస్తాయి. కౌలు రైతు కోసం అసలు రైతులు పెట్టుబడి సాయాన్ని కోల్పోయేందుకు సిద్ధంగా ఉంటారా? అనేది పెద్ద ప్రశ్న. ఎవరైనా ఒప్పందం కోసం పట్టుబడితే తమ భూమినే కౌలుకు ఇచ్చేది లేదని అసలు రైతులు తేల్చి చెప్పే అవకాశమూ లేకపోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో కౌలు రైతులను ఏవిధంగా గుర్తిస్తారనేది పెద్ద ప్రశ్నగా మారింది.
సబ్‌కమిటీలో నిర్ణయం
రైతుబంధును రైతుభరోసాగా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకంలో కోతలు పెట్టాలని, కొంతమంది రైతులను అనర్హులుగా ప్రకటించాలని భావిస్తున్నది. విధివిధానాల ఖరారుకు ఇప్పటికే మంత్రులతో సబ్‌కమిటీని ఏర్పాటుచేసింది. జూలై 15లోపు నివేదిక ఇవ్వాలని సబ్ కమిటీని ఆదేశించింది. ఈ నేపథ్యంలో సబ్‌కమిటీ త్వరలోనే తన పని మొదలుపెట్టనున్నది. పార్టీ ఇచ్చిన హామీ మేరకు కౌలు రైతులకు కూడా రైతుభరోసా ఇవ్వడంపై క్యాబినెట్ సబ్ కమిటీలో చర్చించనున్నట్టు సమాచారం. కౌలు రైతులకు ఎలా ఇవ్వాలి? వారికి ఇవ్వడం వల్ల అసలు రైతులకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? అసలు కౌలు రైతులను ఏవిధంగా గుర్తించాలి? వంటి అంశాలపై సబ్‌కమిటీలో చర్చించనున్నారు. ఆ తర్వాత కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా విధి విధానాలను రూపొందించనున్నట్టు తెలిసింది.
