Saturday, February 21, 2026

స్పెక్ట్రమ్‌ వేలం అట్టర్‌ ఫ్లాప్‌.. ఆసక్తి చూపని టెలికం సంస్థలు

7 రౌండ్లలో వచ్చిన బిడ్లు రూ.11,341 కోట్లే

రూ.1,000 కోట్లు కూడా పెట్టని రిలయన్స్‌ జియో

మొత్తం అమ్ముడుపోయింది 141 మెగాహెట్జ్‌లే

రెండో రోజు మధ్యలోనే వేలాన్ని ఆపేసిన అధికారులు

కేంద్ర ప్రభుత్వానికి తప్పని నిరాశ

ద్రోణ న్యూఢిల్లీ, జూన్‌

దాదాపు రెండేండ్ల తర్వాత చేపట్టిన స్పెక్ట్రమ్‌ వేలం.. పూర్తిగా రెండు రోజులు కూడా కొనసాగలేకపోయింది. దేశీయ టెలికం సంస్థలు ఈసారి పెద్దగా ఆసక్తి చూపలేదు మరి. తొలిరోజు నుంచే ఈ సంకేతాలు కనబడగా.. రెండోరోజు అది విస్పష్టమైంది. మంగళవారం వేలం ప్రక్రియ మొదలవగా.. మొత్తం 5 రౌండ్లలో సుమారు రూ.11,000 కోట్ల స్పెక్ట్రమ్‌ కోసం బిడ్లు వచ్చాయి. ఇక రెండో రోజైన బుధవారం 2 రౌండ్లలో రూ.350 కోట్ల స్పెక్ట్రమ్‌ కోసమే బిడ్లు దాఖలైయ్యాయి. దీంతో చేసేదేమీలేక సంబంధిత అధికారులు మొదలైన కాసేపటికే (ఉదయం 11:30 గంటలకు) వేలాన్ని ఆపేస్తున్నట్టు ప్రకటించేశారు.
ఈ క్రమంలోనే మొత్తం 7 రౌండ్లలో రూ.11,340.78 కోట్ల విలువైన 141.4 మెగాహెట్జ్‌ల స్పెక్ట్రమ్‌ కోస మే బిడ్లు వచ్చినట్టు అధికారిక ప్రకటన విడుదలైంది. నిజానికి ఈసారి వేలంలో 10,500లకుపైగా మెగాహెట్జ్‌ల (10.5 గిగాహెట్జ్‌) స్పెక్ట్రమ్‌ను కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టింది. దీని కనీస విలువ రూ.96,238 కోట్లు. అయితే వచ్చిన బిడ్లు ఇందులో 12 శాతానికే సమానం కావడం గమనార్హం. ఇక అమ్ముదామనుకున్న స్పెక్ట్రమ్‌లో 2 శాతానికి సరిపడా గిరాకీ కూడా రాలేదు. ఇది మోదీ సర్కారుకు తీవ్ర నిరాశనే మిగిల్చింది.
భారతీ ఎయిర్‌టెల్‌ టాప్‌
ఈ వేలంలో ప్రైవేట్‌ రంగ టెలికం సంస్థలైన రిలయన్స్‌ జియో, భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలు పాల్గొన్నాయి. ఇందులో రూ.6,856.76 కోట్ల విలువైన 97 మెగాహెట్జ్‌ల స్పెక్ట్రమ్‌ కోసం బిడ్డింగ్‌ వేసి భారతీ ఎయిర్‌టెల్‌ టాప్‌ బిడ్డర్‌గా నిలిచింది. దాదాపు రూ.3,510.4 కోట్ల బిడ్లతో 30 మెగాహెట్జ్‌ల స్పెక్ట్రమ్‌ కొని వొడాఫోన్‌ ఐడియా రెండో స్థానంలో ఉండగా, రూ.973.62 కోట్ల బిడ్డింగ్‌తో 14.4 మెగాహెట్జ్‌ల స్పెక్ట్రమ్‌ తీసుకొని దేశీయ టెలికం దిగ్గజం రిలయన్స్‌ జియో ఆఖరు స్థానంలో స్థిరపడినట్టు అధికారిక ప్రకటన చెప్తున్నది.ఇక అమ్ముడుపోయిన స్పెక్ట్రమ్‌లో దాదాపు 70 శాతం ఎయిర్‌టెలే కొన్నది. 900, 1,800, 2,100 మెగాహెట్జ్‌ల్లోని స్పెక్ట్రమ్‌ను సొంతం చేసుకున్నది సంస్థ. ఇందులోనే ఎయిర్‌టెల్‌ అనుబంధ సంస్థ భారతీ హెక్సాకామ్‌ రూ.1,001 కోట్లతో 15 మెగాహెట్జ్‌ల స్పెక్ట్రమ్‌ను దక్కించుకున్నది. కాగా, 6 సర్కిళ్లలో ఎయిర్‌టెల్‌ స్పెక్ట్రమ్‌, 2 సర్కిళ్లలో వొడాఫోన్‌ ఐడియా స్పెక్ట్రమ్‌ గడువులు తీరిపోతుండటం వల్లే ఈసారి ఈ రెండు సంస్థలు స్పెక్ట్రమ్‌ కొనుగోళ్లకు ముందుకొచ్చాయని తెలుస్తున్నది.
అప్పుల భారంతో సతమతమవుతున్నా వొడాఐడియా మాత్రం 4జీ సేవలను మెరుగుపర్చడానికే ఈ వేలంలో పాల్గొన్నట్టు చెప్తున్నారు. లేకపోతే ఈమాత్రం ఆదరణ కూడా రాదన్న అభిప్రాయాలు ఇప్పుడు మిక్కిలి ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్నాయి. ఇక మొత్తం 8 ఫ్రీక్వెన్సీల్లోని రేడియో తరంగాలను ఈసారి వేలంలో అమ్మకానికి పెట్టారు. వీటిలో 800, 900, 1,800, 2,100, 2,300, 2,500, 3,300 మెగాహెట్జ్‌లతోపాటు 26 గిగాహెట్జ్‌ శ్రేణులున్నాయి.

ఇదీ సంగతి.
స్పెక్ట్రమ్‌ వేలం ఇంతలా ఫ్లాప్‌ షో కావడానికి కారణం.. దేశీయ టెలికం కంపెనీల దృష్టి, వ్యూహాలు, విధానాలు, లక్ష్యాలు వేరే ఉండటమేనని మార్కెట్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే ఉన్న స్పెక్ట్రమ్‌ రెన్యువల్‌కే టెల్కోలు ఇష్టపడుతున్నారని, కొత్తగా మరింత స్పెక్ట్రమ్‌ను అందిపుచ్చుకోవాలని కోరుకోవడం లేదని అంటున్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా 5జీ సేవల విస్తరణ, అందుకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకే టెల్కోలు తమ పెట్టుబడులను మళ్లిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే తాము ఊహించినట్టుగానే ఈసారి స్పెక్ట్రమ్‌ వేలానికి ఆదరణ కరువైనట్టు ఎక్స్‌పర్ట్స్‌ చెప్తున్నారు. టెలికం సంస్థలు ముందుగా చేసిన అరకొర డిపాజిట్లతోనూ ఈసారి వేలం ఫ్లాప్‌ షోనేనని తేలిందంటున్నారు. ఇదిలావుంటే తొలిరోజు సాయంత్రం వరకు 900, 1,800 మెగాహెట్జ్‌ బ్యాండ్లలో రేడియో తరంగాల కోసమే బిడ్లు ఎక్కువగా వచ్చాయని టెలికం శాఖ వెల్లడించింది. అయితే మూడు సర్కిళ్లలో 2,100 మెగాహెట్జ్‌ బ్యాండ్‌ స్పెక్ట్రమ్‌కూ డిమాండ్‌ వచ్చినట్టు వివరించింది. కాగా, 2022లో జరిగిన స్పెక్ట్రమ్‌ వేలం 7 రోజులు సాగింది. సూపర్‌ హిైట్టెన ఈ ఆక్షన్‌కు టెలికం సంస్థల నుంచి విశేష స్పందన లభించింది. దీంతో రూ.1.5 లక్షల కోట్లకుపైగా విలువైన 5జీ స్పెక్ట్రమ్‌ అమ్ముడుపోయింది. రూ.88,078 కోట్లతో సగానికిపైగా స్పెక్ట్రమ్‌ను దక్కించుకొని జియో సంస్థ టాప్‌ బిడ్డర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. నాడు ఎయిర్‌టెల్‌ (రూ.43,084 కోట్లు), వొడాఫోన్‌ ఐడియా (రూ.18,799 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
అమ్మకానికి పెట్టిన స్పెక్ట్రమ్‌ 10,500 మెగాహెట్జ్‌లు
అమ్ముడుపోయింది 141.4 మెగాహెట్జ్‌లే వేలం ద్వారా కేంద్రం ఆశించిన మొత్తం రూ.96,238 కోట్లు
వచ్చిన బిడ్లు రూ.11,340.78 కోట్లే వేలంలో ప్రభుత్వ రంగ సంస్థలకు నో ఎంట్రీ
బీఎస్‌ఎన్‌ఎల్‌, ఎంటీఎన్‌ఎల్‌పై మరోమారు చిన్నచూపు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular