Tuesday, February 24, 2026

గులాబీ పార్టీని వీడితే బాధలేదు

భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు ఇప్పటికే ఎంతోమంది పార్టీని వీడి కాంగ్రెస్ గూటి చేరారు. మరి కొంతమంది పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. పార్టీని వీడుతున్న వారి గురించి గులాబీ దళపతి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని వీడి
వాళ్లు పార్టీని ప్రభావితం చేయలేరు.మెరికల్లాంటి నేతల్ని తయారుచేద్దాం.తెలంగాణ కలలను నెరవేర్చేది మనమే
రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దాం అని పిలుపునిచ్చారు.నాయకులకు కేసీఆర్‌ దిశా నిర్దేశం
ఎర్రవల్లిలో నేతలతో సమావేశం నిర్వహించారు.పార్టీ నుంచి పోయి దొంగలల్ల కలుస్తున్న నాయకుల గురించి ఏమాత్రం ఆలోచించాల్సిన అవసరం లేదని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ స్పష్టం చేశారు. సమైక్యవాదులతో కలబడి నిలబడి అత్యంత కష్టతరమైన తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులకు ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు లెక్కనే కాదని పేర్కొన్నారు. ఒక్కరుపోతే పదిమంది నాయకులను పార్టీ తీర్చిదిద్దుతుందని తేల్చిచెప్పారు. శుక్రవారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కోరుట్ల, జగిత్యాల పార్టీ ముఖ్యనాయకులు, కార్యకర్తలతో కేసీఆర్‌ సమావేశమయ్యారు. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌, మాజీమంత్రి, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, డాక్టర్‌ సంజయ్‌, పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్‌ రమణ, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, జీవన్‌రెడ్డి, జాజాల సురేందర్‌, గంప గోవర్ధన్‌, హన్మత్‌షిండే, జగిత్యాల జడ్పీ చైర్‌పర్సన్‌ వసంతసురేశ్‌, పెద్దపల్లి నేత ఉష తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ తన వృత్తిని కొనసాగిస్తూనే ప్రజలకు అందుబాటులో ఉంటున్నారని, వారి మన్ననలు పొందుతున్నారని కొనియాడారు. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తాత్కాలిక ఒడిదొడుకులు, ఎన్నికల ఫలితాలు పార్టీకి కొత్తకాదని చెప్పారు. తెలంగాణ ప్రగతి ప్రస్థానంలో చేరుకోవాల్సిన మైలురాళ్లు ఇంకా చాలా మిగిలే ఉన్నాయని తెలిపారు. ‘తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, కలలను నెరవేర్చగలిగే అవగాహన మనకు మాత్రమే ఉన్నది’ అని చెప్పారు. తెలంగాణ ఆత్మను అర్థం చేసుకుంటూ సమస్యల లోతును పట్టుకోగలిగి పరిషరించగలిగే సత్తా ఉద్యమాన్ని నడిపించి, రాష్ట్రాన్ని సాధించిన బీఆర్‌ఎస్‌ పార్టీకి మాత్రమే ఉన్నదని పేర్కొన్నారు. ‘నాడు మనం ఉద్యమంలో దిగినప్పుడు మనతో ఎవరున్నారు? ఆనాడైనా, ఈనాడైనా నాయకులను తయారు చేసుకునేది పార్టీనే’ అని స్పష్టం చేశారు. ‘మొన్న జగిత్యాల నుంచి ఒకాయన పోయి దొంగలల్ల కలిసిండు. బాధ పడేదేమీలేదు. ఆయనను తయారుచేసింది పార్టీనే. అంతకన్నా మెరుగైన నాయకత్వాన్ని పార్టీ తయారుచేసుకుంటది’ అని స్పష్టం చేశారు.నెరవేరాల్సింది ఎంతో ఉంది’మనం రెట్టించిన ఉత్సాహంతో ప్రజలకోసం ఇంకా బాగా పనిచేయాల్సి ఉంది’ అని పార్టీ శ్రేణులకు కేసీఆర్‌ పిలుపునిచ్చారు. ప్రజలు అవకాశమివ్వడంతో గత పదేండ్లు చిత్తశుద్ధితో, రాజీపడకుండా ఉద్యమ ఆకాంక్షల సాధన దిశగా అడుగులు వేశామని గుర్తుచేశారు. ఈ ప్రయాణంలో ప్రజల మన్నననలు కూడా పొందామని పేర్కొన్నారు. ‘కుల మతాలకు అతీతంగా పని చేస్తూ వ్యవసాయం, సాగునీరు, విద్యుత్తు వంటి అనేక మౌలిక వ్యవస్థలను మెరుగుపరుస్తూ అనేక ప్రజా సమస్యలకు పరిషారం చూపినం. కుల వృత్తులను బాగుచేసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసినం’ అని వివరించారు. ప్రజాస్వామ్యంలో కొన్నిసార్లు అబద్ధపు ప్రచారాలను నమ్మి ప్రజలు బోల్తాపడుతుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. మొన్నటి ఎన్నికల్లో జరిగింది అదేనన్నారు. ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన నిరుత్సాహపడొద్దని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ‘అధికారం ఉంటేనే పనిచేస్తామనే పద్ధతికాదు. మనం ఏ హోదాలో ఉన్నా ప్రజలకోసం పని చేయాల్సిందే. అంతిమ లక్ష్యం తెలంగాణ ప్రజల సంక్షేమం, అభివృద్ధి మాత్రమే’ అని వివరించారు. తెలంగాణలో ఇంకా నెరవేరాల్సిన ప్రజల కలలను మనం మాత్రమే నిజం చేయగలమని కేసీఆర్‌ పేర్కొన్నారు.కేసీఆర్‌ ఆత్మీయ సమావేశాలకు 3 రోజుల బ్రేక్‌
పదిహేను రోజులుగా అధినేత కేసీఆర్‌తో వరుసగా కొనసాగుతున్న ఆత్మీయ సమావేశాలకు మూడు రోజులపాటు విరామం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. ఎన్నికల అనంతరం ఇప్పటికే పలు దఫాలుగా ముందస్తు సమాచారంతో పార్టీ కార్యకర్తలు, నేతలు అధినేతను కలుస్తున్నారు. తనను కలిసేందుకు ఎర్రవెల్లికి వస్తున్న ప్రజలతో గంటల తరబడి నిలబడి పేరుపేరునా పలకరించి కేసీఆర్‌ వారి యోగక్షేమాలు ఆరా తీస్తున్నారు. కేసీఆర్‌ ఆరోగ్యం, విశ్రాంతి, పార్టీ భవిష్యత్తు కార్యాచరణ వంటి అంశాలపై వివిధ వర్గాలతో చర్చించే అవకాశం ఉండడంతో మూడు రోజులపాటు ఆత్మీయ సమావేశాలకు విరామం ఇవ్వాలని పార్టీ నిర్ణయించింది. సమావేశాలు మళ్లీ ఎప్పటి నుంచి నిర్వహించేది, ఏయే నియోజకవర్గాల నుంచి పార్టీ నేతలు రావాలన్న విషయమై త్వరలోనే వెల్లడిస్తామని పార్టీ వర్గాలు తెలిపాయి.
సెల్ఫీలకు పోటీపడుతున్న శ్రేణులు
అధినేత కేసీఆర్‌తో ఫొటోలు దిగేందుకు పార్టీ శ్రేణులు పోటీపడుతున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు కేసీఆర్‌తో ఫొటో తీసుకునేందుకు దాదాపు రెండు గంటల సమయం పడుతున్నది. నియోజకవర్గాల వారీగా పార్టీ శ్రేణుల యోగక్షేమాలను కేసీఆర్‌ ఆరా తీస్తుండడంతో నాయకులు సంబురపడుతున్నారు. జై కేసీఆర్‌… జై తెలంగాణ నినాదాలతో ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రం మారుమోగిపోతున్నది.

నిజామాబాద్‌ నేతలతో కేసీఆర్‌ ప్రత్యేక భేటీ
ఉమ్మడి నిజామాబాద్‌ నేతలతో బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. శుక్రవారం తన వ్యవసాయ క్షేత్రంలో మాజీమంత్రితో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్‌, జీవన్‌రెడ్డి, జాజాల సురేందర్‌, హన్మత్‌షిండే సమావేశమయ్యారు. జిల్లాలోని రాజకీయ పరిస్థితులపై చర్చించారు. పార్టీ బలోపేతం కోసం అనుసరించాల్సిన వ్యూహంపై ఇతర ముఖ్యనేతలతో త్వరలో సమావేశం నిర్వహిస్తామని ఈ సందర్భంగా కేసీఆర్‌ పేర్కొన్నట్టు సమాచారం.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular