నిజామాబాద్ లో జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ మాజీ అధ్యక్షులు, మాజీమంత్రి ధర్మపురి శ్రీనివాస్ అంత్యక్రియల కార్యక్రమానికి టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్, మాజీ పార్లమెంట్ సభ్యులు మధుయాష్కి గౌడ్ హాజరయ్యారు. అంతకముందు డి.శ్రీనివాస్ నివాసంలో.. ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి , మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి , కేరళ ఎంపీ సురేష్ తదితర ప్రముఖులతో కలిసి శ్రీనివాస్ పార్థివదేహానికి మధు యాష్కి గౌడ్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా మధుయాష్కి గౌడ్ మాట్లాడుతూ.. శ్రీనన్న మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. తనకు అత్యంత ఆత్మీయుడని, తన రాజకీయ గురువు, శ్రీనన్న అని పేర్కొన్నారు. విదేశాల నుంచి నుంచి వచ్చిన తనకు నిజామాబాద్ ఎంపీ టికెట్ కోసం సోనియాగాంధీన ని ఒప్పించి, పోటీ చేయించి ప్రోత్సహించారన్నారు. నిజామాబాదుకు మెడికల్ కళాశాల తీసుకొచ్చిన ఘనత శ్రీనన్నదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో శ్రీను అన్నది కీలక పాత్ర అని పేర్కొన్నారు. అనివార్య కారణాలతో ఇతర పార్టీలకు వెళ్లి తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చిన శ్రీనన్న .. ఇక తన తుది శ్వాస వరకు కాంగ్రెస్ లోనే ఉండాలని కోరుకున్నాడని, తను చనిపోయినప్పుడు తన శరీరంపై కాంగ్రెస్ కండువ ఉండాలని ఇటీవల తనతో పేర్కొన్నాడని మధు యాస్కిగౌడ్ గుర్తు చేశారు. తెలంగాణ, ఏపీలోనే కాకుండా జాతీయస్థాయిలోనూ ఆయన మంచి గుర్తింపు పొందారని పేర్కొన్నారు.కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు, ఎమ్మెల్యే లు సుదర్శన్ రెడ్డి, రాకేష్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ తదితర నాయకులు డి. శ్రీనివాస్ పార్థివదేహానికి నివాళులర్పించారు.
