మాట తప్పని చంద్రన్న ఊరూవాడ పింఛన్ల పండగ
తెదేపా కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రూ.7 వేలు చొప్పున పింఛను మొత్తాన్ని లబ్ధిదారులకు అందించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమైంది.
సోమవారం వాడవాడలా పింఛన్ల పంపిణీ ప్రక్రియ సందడిగా సాగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు లబ్ధిదారులకు పింఛను సొమ్ము పంపిణీ చేశారు. పలుచోట్ల లబ్ధిదారులు, తెదేపా నాయకులు, శ్రేణులు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్, కలెక్టర్ వినోద్‌కుమార్‌తో కలిసి ఉరవకొండ మండలం పాతపేట ఆంజనేయస్వామి ఆలయం వద్ద పింఛన్ల పంపిణీ ప్రారంభించారు. రాప్తాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పరిటాల సునీత, హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి.. అనంత నగరంలో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు, శింగనమల నియోజకవర్గంలో ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ, గుంతకల్లు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పింఛన్ల పంపిణీలో పాల్గొన్నారు.
రాష్ట్ర విభజన కన్నా వైకాపా పాలనలోనే తీవ్ర నష్టం
రాష్ట్ర విభజన కన్నా.. వైకాపా పాలనలోనే ఆంధ్రప్రదేశ్‌కు తీవ్ర నష్టం జరిగిందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. సోమవారం ఆయన ఉరవకొండ పట్టణంలో ఎన్టీఆర్ భరోసా కింద సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు. లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సందేశంతో కూడిన పత్రంతోపాటు పింఛన్ నగదు అందజేశారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. వైకాపా పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంచనా వేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. కార్యక్రమంలో ఏపీఐడీసీ మాజీ డైరెక్టర్ దేవినేని పురుషోత్తం, తెదేపా నాయకులు ప్యారం కేశవానంద, రేగటి నాగరాజు, ఎర్రగుంట్ల వెంకటేశులు, భగవాన్, రాజేశ్, గోవిందు, తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.
అనంతది మూడో స్థానం
జిల్లాలో 2,89,508 మంది లబ్ధిదారులకు రూ.197.44కోట్లు ఇంటింటికి వెళ్లి అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల తరువాత అనంతదే స్థానమని అన్నారు. కార్యక్రమంలో అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్ మేఘస్వరూప్, తహసీల్దార్ దస్తగిరయ్య, ఎంపీడీఓ సుబ్బరాజు, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
మొదటి రోజే 93.79 శాతం
అనంత సంక్షేమం: పింఛన్ పంపిణీతో అవ్వాతాతల మొహాల్లో నవ్వులు విరబూశాయి. సోమవారం మొదటి రోజే 93.79 శాతం పంపిణీ ప్రక్రియ చేపట్టి సచివాలయ సిబ్బందితో వాలంటీర్ల కంటే వేగంగా పంపిణీ చేయవచ్చు అని ప్రయోగాత్మకంగా నిరూపించారు. కేవలం 18,209 మంది పలు కారణాలతో అందుబాటులో లేకపోవడంతో వారందరికీ మంగళవారం పింఛను సొమ్ము అందివ్వనున్నారు.
కొండంత అండగా
కళ్యాణదుర్గం గ్రామీణం: మండలంలోని బోరంపల్లిలో ఎర్రిస్వామితోపాటు ఆయన మానసిక దివ్యాంగులైన ముగ్గురు కుమార్తెలకు ఈనెల పింఛను రూ.43 వేలు అందింది. దాంతో వారి సంతోషానికి అవధులు లేకుండాపోయాయి. నిర్మల, అనంతలక్ష్మికి గతంలో ఒక్కొక్కరికి రూ.5 వేలు వచ్చేది. ప్రస్తుతం ఒక్కొక్కరికి రూ.15 వేలు అందాయి. మరో కుమార్తె అంజలికి గతంలో రూ.3 వేలు వస్తుండగా ఇప్పుడు రూ.6 వేలు, ఎర్రిస్వామికి వృద్ధాప్య పింఛన్ గతంలో రూ.3 వేలు రాగా ప్రస్తుతం రూ.7 వేలు అందుకున్నారు. గత నెల వరకు తమకు రూ.16 వేలు పింఛను వచ్చేదని, అందులో వైద్యానికి రూ.13,500 వరకు ఖర్చు అయ్యేదని, మిగిలిన డబ్బుతో కుటుంబాన్ని ఎంతో కష్టంగా నెట్టుకొచ్చేవారమని వాపోయారు. తమలాంటి నిస్సాహాయ కుటుంబానికి సీఎం చంద్రబాబునాయుడు పింఛన్ సొమ్ము పెంచి ఇంటికి పెద్దకొడుకులా ఆదుకున్నారని కృతజ్ఞతలు తెలియజేశారు.
అమరావతి నిర్మాణానికి వితరణ
అమరావతి నిర్మాణానికి పామిడి పట్టణానికి చెందిన సూర్యనారాయణ తనకు వచ్చిన వృద్ధాప్య పింఛను రూ.7వేలను వితరణ చేశారు. సోమవారం స్థానిక ఎన్టీఆర్ విగ్రహం వద్ద పింఛను సొమ్మును ఆయన తెదేపా యువ నాయకుడు గుమ్మనూరు ఈశ్వర్‌కు అందజేశారు. ఈ నగదును సీఎం ఖజానాకు అందించాలని ఈశ్వర్‌ను కోరారు.
