ద్రోణ నిజామాబాద్
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న అధ్యాపకులకు జీరో సర్విస్ తో బదిలీలు చేపట్టాలని ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపకుల సంఘం 269 రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణ డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణ బదిలీలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. జూనియర్ కళాశాల యందు దాదాపు 16 సంవత్సరాల నుండి అధ్యాపకులు కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నారని గత ఏడాది క్రితం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం వీరిని ఉన్నచోటనే క్రమబద్ధీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న బదిలీలలో వీరికి అవకాశం కల్పించాలని ఇందుకు అనుగుణంగా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన కోరారు. సుదీర్ఘ కాలం పాటు ఒకే చోట అధ్యాపకులు విధులు నిర్వహించడం వల్ల అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బదిలీలలో జీరో సర్వీస్కు కూడా అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తే అధ్యాపకులకు న్యాయం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. మానవత దృక్పథంతో ప్రభుత్వం అధ్యాపకుల సమస్యను గుర్తించి బదిలీలకు అవకాశం కల్పించాలని ఇప్పటికే ఉన్నత శాఖ అధికారులకు తమ సమస్యలను బాధలను తెలియచేయడం జరిగిందని వీటిని అధికారులు పరిగణనలోకి తీసుకొని న్యాయం చేయాలని ఆయన కోరారు.
