జగన్నాథ విశిష్టతలు
ద్రోణ న్యూఢిల్లీ ప్రతినిధి
పూరీ జగన్నాథ ఆలయ చరిత్ర ఏమిటి ? పూరీ పట్టణాన్ని పూర్వం ఏమని పిలిచేవారు ?
మన భారతదేశంలో పురాణకాలం నుండీ ప్రసిద్ధి చెందిన పట్టణాలలో పూరీ ఒకటి. ఈ పట్టణం ఒరిస్సా రాష్ట్ర రాజధాని అయిన భువనేశ్వర్ కి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పట్టణాన్ని పూర్వం పురుషోత్తమ క్షేత్రమని , శ్రీ క్షేత్రం అని కూడా పిలిచేవారు. ఈ పట్టణంలో విష్ణువు జగన్నాధుని పేరిట కొలువై పూజలందుకుంటున్నాడు. ఈ ఆలయం వైష్ణవ దివ్యదేశాల్లో ప్రముఖమైనది మరియూ హిందువులు అతి పవిత్రంగా భావించే “చార్ ధాం” పుణ్యక్షేత్రాలలో ఒకటి. ఈ ఆలయాన్ని 1078 లో కళింగ పరిపాలకుడైన అనంతవర్మ చోడగంగాదేవ ప్రారంభించగా ఆయన మనవడైన రాజా అనంగ భీమదేవ్ పాలనలో పూర్తయింది. అంతకు ముందు అక్కడున్న ఆలయాన్ని ఇంద్రద్యుమ్న మహారాజు కట్టించాడని అంటారు. దీని వెనకో కథ ఉంది.
జగన్నాథుడిని పూజించిన విశ్వావసుడు
ఈ జగన్నాథుడు గిరిజనుల దేవుడనీ , నీలమాధవుడనే పేరుతో పూజలందుకున్నాడనీ స్థలపురాణం. అడవిలోని ఓ రహస్య ప్రదేశంలో ఉన్న ఈ జగన్నాథుణ్ని గిరిజనుల రాజైన విశ్వావసుడు పూజించేవాడట. విషయం తెలుసుకున్న ఇంద్రద్యుమ్న మహారాజు , ఆ రహస్యాన్ని కనిపెట్టడానికి విద్యాపతి అనే బ్రాహ్మణ యువకుణ్ని అడవికి పంపుతాడు. విశ్వావసుడి కూతురైన లలితను విద్యాపతి ప్రేమించి పెళ్ళాడతాడు. ఈ జగన్నాధ విగ్రహాన్ని చూపించమని పదేపదే ప్రాధేయపడుతున్న అల్లుడి విన్నపాన్ని కాదనలేని ఆ సవర రాజు , అతని కళ్లకు గంతలు కట్టి గుడి దగ్గరికి తీసుకువెళతాడు. విద్యాపతి ఆ దారి తెలుసుకునేందుకు తెలివిగా తాను వెళ్ళే ఆ దారి పొడుగునా ఆవాలు జారవిడుస్తాడు. కొన్నాళ్లకు అవి మొలకెత్తి దారి స్పష్టంగా తెలుస్తుంది. దీంతో వెంటనే అతను ఇంద్రద్యుమ్న మహారాజుకు కబురు పెడతాడు.కలలో కనిపించిన జగన్నాథుడు రాజు అడవికి చేరుకునే లోగా అక్కడ ఆ విగ్రహాలు మాయమవుతాయి. దీంతో ఇంద్రద్యుమ్నుడు నిరాశతో నిరాహారదీక్ష మొదలుపెట్టి , అశ్వమేథయాగం చేస్తాడు. నీలాచలం మీద ఓ ఆలయాన్ని నిర్మించి నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఒకనాడు ఆయన అక్కడే నిద్రిస్తుండగా , జగన్నాథుడు కలలో కనిపించి సముద్రతీరంలో చాంకీనది ముఖద్వారానికి వేప కొయ్యలు కొట్టుకొస్తాయనీ వాటితో విగ్రహాలు చేయించమనీ ఆదేశిస్తాడు. కొయ్యలైతే కొట్టుకొచ్చాయి కానీ , విగ్రహ నిర్మాణానికి ఎవరూ ముందుకు రాలేదు. ఏం చేయాలా అని రాజు ఆలోచిస్తున్న సమయంలో దేవశిల్పి విశ్వకర్మ వికలాంగుడి రూపంలో వస్తాడు. తానొక్కడినే రహస్యంగా ఓ గదిలో విగ్రహాలకు రూపకల్పన చేస్తాననీ , ఆ సమయంలో పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోననీ , ఆ 21 రోజులూ అటువైపు ఎవరూ రాకూడదనీ , తన పనికి ఆటంకం కలగకూడదనీ షరతు విధిస్తాడు. రాజు అంగీకరిస్తాడు. రోజులు గడుస్తున్నా గదిలోంచి ఎలాంటి శబ్దమూ రాదు. దీంతో రాణి గుండిచాదేవి తొందర పెట్టడంతో గడువు పూర్తికాకుండానే రాజు తలుపులు తెరిపిస్తాడు.
పూరీ విగ్రహాలకు కనిపించని అభయహస్తం , వరదహస్తం
శిల్పి కనిపించడు. చేతులూ కాళ్లూ లేని , సగం చెక్కిన విగ్రహాలు మాత్రం దర్శనమిస్తాయి. పశ్చాత్తాపంతో రాజు బ్రహ్మదేవుడిని ప్రార్థిస్తాడు. చతుర్ముఖుడు ప్రత్యక్షమై ఇకమీదట అదేరూపంలో విగ్రహాలు పూజలందుకుంటాయని ఆనతిస్తాడు. తానే స్వయంగా వాటికి ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. అందుకే పూరీ ఆలయంలోని విగ్రహాలకు అభయహస్తం , వరదహస్తం కనిపించవు. చతుర్దశ భువనాలనూ వీక్షించడానికా అన్నట్టు ఇంతింత కళ్లు మాత్రం ఉంటాయి. దేశంలో ఎక్కడ లేనివిధంగా పూజలందుకుంటున్న ఇక్కడి ఈ దారు దేవత మూర్తులను 8-12 లేదా 19 సంవత్సరాలకి ఒకసారి మార్చి నూతన దేవతా మూర్తులను ప్రతిష్టించుతూ ఉంటారు. దీనిని నవ కళేబర ఉత్సవంగా నిర్వహిస్తారు. ఈ ఆలయ ఆధ్వర్యంలో జరిగే ఉత్సవాలన్నింటికల్లా ముఖ్యమైనది జగన్నాథ రథయాత్ర. ” జగన్నాధ రధ యాత్ర “ గా పిలవబడే ఈ రధయాత్రలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు..
12 రోజుల పాటు జరిగే ఉత్సవం
సాధారణంగా ఏ హిందూ ఆలయంలోనైనా సరే , ఊరేగింపు నిమిత్తం మూలవిరాట్టును కదిలించరు. అందుకు ఉత్సవ విగ్రహాలుంటాయి. అలాగే ఊరేగింపు సేవలో ఏటా ఒకే రథాన్ని వినియోగించడం అన్ని చోట్లా చూసేదే. ఈ సంప్రదాయాలన్నింటికీ మినహాయింపు ఒడిశాలోని ఈ పూరీ జగన్నాథ స్వామి ఆలయం. బలభద్ర , సుభద్రలతో సహా ఈ ఆలయంలో కొలువైన జగన్నాథుడిని ఏడాదికొకసారి గుడిలోంచి బయటికి తీసుకువచ్చి భక్తులకు కనువిందు చేస్తారు. ఊరేగించేందుకు ఏటా కొత్తరథాలను నిర్మిస్తారు. అందుకే ఈ జగన్నాథ రథయాత్రను అత్యంత అపురూపంగా భావిస్తారు భక్తులు. ఈ ఉత్సవం ప్రతి సంవత్సరం ఆషాడ శుధ్ధ విధియ రోజున ప్రారంభమై 3 కిలోమీటర్ల దూరంలోని గుండిచా ఆలయం వరకు సాగుతుంది. ఆ తరువాత సుభద్ర , బలబద్ర సమేత జగన్నాథుని ఉత్సవ మూర్తులు బహుదా యాత్ర పేరిట తిరిగి పూరీ ఆలయానికి చేరటంతో ముగుస్తుంది. ఇది 12 రోజులు పాటు జరిగే ఉత్సవం. ఈ యాత్రకి రెండు నెలలముందు నించే దీనికి సంబంధించిన ఏర్పాట్లు మొదలవుతాయి.
రథం ఇలా ఉంటుంది
వైశాఖ బహుళ విదియనాడు రథనిర్మాణానికి కావలసిన ఏర్పాట్లు చేయమని ఆదేశిస్తాడు పూరీ రాజు. అందుకు అవసరమైన వృక్షాలను 1072 ముక్కలుగా ఖండించి పూరీకి తరలిస్తారు. ప్రధాన పూజారి , తొమ్మిది మంది ముఖ్య శిల్పులు , వారి సహాయకులు మరో 125 మంది కలిసి అక్షయ తృతీయనాడు రథ నిర్మాణం మొదలుపెడతారు. 1072 వృక్ష భాగాలనూ నిర్మాణానికి అనువుగా 2188 ముక్కలుగా ఖండిస్తారు. వాటిలో 832 ముక్కల్ని జగన్నాథుడి రథం తయారీకీ , 763 కాండాలను బలరాముడి రథనిర్మాణానికీ , 593 భాగాలను సుభద్రాదేవి రథానికీ వినియోగిస్తారు. ఆషాఢ శుద్ధ పాడ్యమినాటికి రథనిర్మాణాలు పూర్తయి యాత్రకు సిద్ధమవుతాయి. ఇందులో జగన్నాథుడి రథాన్ని ” నందిఘోష అంటారు. 45 అడుగుల ఎత్తున ఈ రథం పదహారు చక్రాలతో మిగతా రెండిటికన్నా పెద్దదిగా ఉంటుంది. ఎర్రటిచారలున్న పసుపువస్త్రంతో ‘నందిఘోష’ను అలంకరిస్తారు. బలభద్రుడి రథాన్ని ” తాళధ్వజం “ అంటారు. దీని ఎత్తు 44 అడుగులు. పద్నాలుగు చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న నీలివస్త్రంతో ఈ రథాన్ని కప్పుతారు. సుభద్రాదేవి రథం ” పద్మధ్వజం “. దీని ఎత్తు 43 అడుగులు. పన్నెండు చక్రాలుంటాయి. ఎర్రటి చారలున్న నలుపు వస్త్రంతో పద్మధ్వజాన్ని అలంకరిస్తారు. ప్రతిరథానికీ 250 అడుగుల పొడవూ ఎనిమిది అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారు. ఆలయ తూర్పుభాగంలో ఉండే సింహద్వారానికి ఎదురుగా ఉత్తరముఖంగా ఈ మూడు రధాలనీ నిలబెడతారు.
అంతా ఒక పద్ధతి ప్రకారం
రధయాత్ర మొదటి రోజున మేళతాళాలతో గర్భగుడిలోకి వెళ్ళే పండాలు అని పిలవబడే ఇక్కడి పూజరులు ఉదయకాల పూజాదికాలు నిర్వహిస్తారు. శుభముహూర్తం ఆసన్నమవగానే ‘మనిమా (జగన్నాథా) ‘ అని పెద్దపెట్టున అరుస్తూ రత్నపీఠం మీద నుంచి విగ్రహాలను కదిలిస్తారు. ఆలయ ప్రాంగణంలోని ఆనంద బజారు , అరుణస్తంభం మీదుగా వాటిని వూరేగిస్తూ బయటికి తీసుకువస్తారు. ఈ క్రమంలో ముందుగా దాదాపు ఐదున్నర అడుగుల ఎత్తుండే బలరాముడి విగ్రహాన్ని తీసుకువస్తారు. బలభద్రుడ్ని చూడగానే ” జై బలరామా, జైజై బలదేవా “ అంటూ భక్తులు చేసే జయజయధ్వానాలతో ఆ ప్రాంతమంతా మారుమోగిపోతుంది. బలరాముడి విగ్రహాన్ని ఆయన రథమైన తాళధ్వజం పై ప్రతిష్ఠింపజేస్తారు. అనంతరం ఆ స్వామి విగ్రహానికి అలంకరించిన తలపాగా ఇతర అలంకరణలను తీసి భక్తులకు పంచిపెడతారు. వాటి కోసం భక్తులు ఎగబడతారు. అనంతరం ఇదే పద్ధతిలో సుభద్రాదేవి విగ్రహాన్ని కూడా బయటికి తీసుకువచ్చి పద్మధ్వజం అనే రథం మీద ప్రతిష్ఠిస్తారు.
జగన్నాథుడి దర్శనం కోసం భక్తుల ఎదురు చూపులు
ఇక ఆ జగన్నాథుడిని దర్శించుకునే క్షణం ఎప్పుడెప్పుడా అని తహతహలాడిపోతుంటారు భక్తులు. దాదాపు ఐదడుగుల ఏడంగుళాల ఎత్తుండే జగన్నాథుడి విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలో నుంచి బయటికి తీసుకువస్తుండగానే ” జయహో జగన్నాథా “ అంటూ భక్తిపారవశ్యంతో జయజయధ్వానాలు చేస్తారు. ఇలా మూడు విగ్రహాలనూ రథాలపై కూర్చుండబెట్టే వేడుకను ” పహాండీ “ అంటారు. ఈ దశలో కులమత భేదాలు లేకుండా అందరూ జగన్నాథుడి విగ్రహాన్ని తాకవచ్చు. ఈ మూడు విగ్రహాలనూ తీసుకువచ్చేవారిని దైత్యులు అంటారు. వీరు ఇంద్రద్యుమ్న మహారాజుకన్నా ముందే ఆ జగన్నాథుడిని నీలమాధవుడి రూపంలో అర్చించిన సవరతెగ రాజు విశ్వావసు వారసులు. ఆలయ సంప్రదాయాల ప్రకారం ఊరేగింపు నిమిత్తం మూలవిరాట్టులను అంతరాలయం నుంచి బయటికి తీసుకువచ్చి రథాల మీద ప్రతిష్ఠింపచేసే అర్హత వీరికి మాత్రమే ఉంటుంది.
బంగారు చీపురుతో శుభ్రం చేసే సంస్థానాదీశులు
సుభద్ర , జగన్నాథ , బలభద్రులు రథారూఢులై యాత్రకు సిద్ధంగా ఉండగా పూరీ సంస్థానాధీశులు అక్కడికి చేరుకుంటాడు. జగన్నాథుడికి నమస్కరించి రథం మీదికి ఎక్కి స్వామి ముంగిట బంగారు చీపురుతో శుభ్రం చేస్తాడు. ఈ వేడుకను ” చెరా పహారా “ అంటారు. అనంతరం స్వామిపై గంధం నీళ్లు చిలకరించి కిందికి దిగి రథం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణం చేస్తాడు. ఇదే తరహాలో బలరాముడినీ , సుభద్రాదేవినీ అర్చించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తాడు. అనంతరం రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటిమెట్లను తొలగిస్తారు. ఇక యాత్ర మొదలవడమే తరువాయి. జగన్నాథుడి రథం మీదుండే ప్రధాన పండా నుంచి సూచన రాగానే కస్తూరి కళ్లాపి చల్లి హారతిచ్చి ” జై జగన్నాథా “ అని పెద్దపెట్టున అరుస్తూ తాళ్లను పట్టుకుని రథాన్ని లాగడం మొదలుపెడతారు. విశాలమైన బోడోదండ అని పిలవబడే ప్రధానమార్గం గుండా ఈ యాత్ర మందగమనంతో సాగుతుంది.
నెమ్మదిగా కదిలే రథం
లక్షలాది భక్తజనం నడుమ జగన్నాథుడి రథం అంగుళం అంగుళం చొప్పున చాలా నెమ్మదిగా కదులుతుంది. దీన్నే ఘోషయాత్ర అంటారు. భక్తుల తొక్కిసలాటలో చక్రాలకింద ఎవరైనా పడినా , దారిలో ఏ దుకాణమో అడ్డువచ్చినా రథం వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. అడ్డొచ్చిన దుకాణాలను కూలగొట్టైనా సరే ముందుకే నడిపిస్తారు.ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే జగన్నాథుడి గుడి నుంచి కేవలం మూడు మైళ్ల దూరంలో ఉండే గుండీచా గుడికి చేరుకోవడానికి దాదాపు పన్నెండుగంటల సమయం పడుతుంది. గుండీచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే రథాల్లోనే మూలవిరాట్లకు విశ్రాంతినిస్తారు. మర్నాడు ఉదయం మేళతాళాలతో గుడిలోకి తీసుకువెళతారు. వారం రోజులపాటు గుండీచాదేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమినాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. దీన్ని ” బహుదాయాత్ర “ అని అంటారు. ఆ రోజు మధ్యాహ్నానికి మూడు రథాలూ జగన్నాథ ఆలయానికి చేరుకుని గుడిబయటే ఉండిపోతాయి.
స్వామి వారిని దర్శించుకునేందుకు బారులు తీరే భక్తులు
మర్నాడు ఏకాదశినాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. సునావేషగా వ్యవహారించే ఈ వేడుకను చూసేందుకు బారులు తీరుతారు భక్తులు. ద్వాదశినాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోని రత్నసింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తయినట్లే. యాత్ర పేరిట పదిరోజులుగా స్వామి లేని ఆలయం నూతన జవజీవాలు పుంజుకుని కొత్తకళ సంతరించుకుంటుంది. ఇలాంటి ఎన్నో విశిష్టతలూ , భిన్న సంస్కృతులూ , సాంప్రదాయాలు కలగలిసిన ఈ పూరీ జగన్నాధుని ఆలయాన్ని ఏటా ఎన్నో లక్షల మంది సందర్శిస్తారు.పూరీ జగన్నాథ ఆలయ దర్శనం మీ జన్మ ధన్యం.పూరీ ఒరిస్సా రాష్ట్రంలో భారతదేశంలో తూర్పు వైపు బంగాళాఖాత తీరంలో ఉన్నది. ఇది ఒరిస్సా రాజధాని భువనేశ్వర్ నుండి 60 కిమీ దూరంలో ఉంది. పూరి నగరం చాలా ప్రాముఖ్యం కలిగి ఉన్నది. జగన్నాథ ఆలయాన్ని జగన్నాథ్ పూరీ అని కూడా పిలుస్తారు. భారతదేశంలో ప్రజలు హిందూ మత తీర్ధయాత్రను పూరీను సందర్శించినప్పుడు మాత్రమే యాత్ర పూర్తి అయినదని భావిస్తారు. జగన్నాథ ఆలయం భారతదేశంలో ఉన్న దేవాలయాలల్లో ప్రముఖమైనది. ఇక్కడ రాధా , దుర్గ , లక్ష్మి , పార్వతి , సతి , మరియు కృష్ణ తో శక్తి నిలయాలు ఉన్నాయి. జగన్నాథుని యొక్క పవిత్ర భూమిగా భావిస్తారు. ప్రస్తుతం ఉన్న పూరీని ఒకప్పుడు పురుషోత్తమ పురి , పురుషోత్తమ క్షేత్ర , పురుషోత్తమ ధర్మ , నీలాచల , నీలాద్రి , శ్రీక్షేత్ర , శంఖక్షేత్ర వంటి అనేక పేర్లతో పిలేచేవారు.
మన భారతదేశంలో ఎన్నో ప్రాముఖ్యం , విశిష్టత , అద్భుతం కలిగిన దేవాలయాలు ఎన్నో వున్నాయి. అలాంటి దేవాలయాలు జీవితంలో ఒక్కసారైనా ఖచ్చితంగా దర్శించాలని అంటుంటారు. అలాంటి మహా అద్భుత ఆలయాలలో ఎంతో ప్రసిద్ధిచెందిన పూరీ జగన్నాథ్ ఆలయం.
ఈశాన్య భారతదేశంలోని ఒడిషాలోని ఈ పూరీజగన్నాథ్ ఆలయం వుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం చేసే రథయాత్ర ఎంతో ప్రఖ్యాతమైనది. ప్రపంచ ప్రసిద్ధిచెందింది. ఈ ఆలయాన్ని 1078 సంలో పూరీలో నిర్మించారు.
ఈ ఆలయంలో కృష్ణుడి జీవితాన్ని కళ్ళకుకట్టినట్లు చూపించే గోడలు , స్థంభాలు ఈ ఆలయానికి మరింత శోభను తీస్కోస్తాయి. అన్ని ఆలయాలలో వున్నట్లే గోపురం , దేవతలు , గంటలు , ప్రసాదం అన్నీ వున్నా ప్రతీదానికీ ఒక విశిష్టత వుంది ఇక్కడ. ఇంకా ఎన్నో అద్భుతాలు ఈ ఆలయానికున్నాయి. బహుశా అవి ప్రపంచంలో ఇంకెక్కడా వుండవు అని చెప్పడంలో అతిశయోక్తి లేదేమో అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం
గోపురం
ప్రతి ఆలయంలో గోపురం నీడని మనం చూడొచ్చు గానీ ఈ పూరీ జగన్నాథ ఆలయంలో గోపురం నీడ కన్పించదు. పగలైనా రాత్రైనా అస్సలు కన్పించదు. ఇది దేవుడి కోరిక అంటారు కొందరు. ఆలయ గొప్పదనమని మరికొందరు అంటారు.
రెపరెపలాడే జెండా
ఈ ఆలయగోపురానికి పైనకట్టిన జెండాకి ఒక ప్రత్యేకతవుంది. అన్ని జెండాలలో గాలి ఎటువైపు వస్తే అటు వైపు ఎగురుతుంటాయి కానీ ఇక్కడ గాలికి వ్యతిరేకదిశలో రెపరెపలాడుతుంటుంది. ఇక్కడ ఇంకో ముఖ్యమైనది ఏంటంటే ఆ జెండాను తరచుగా ఆలయప్రత్యేక పూజారులు మారుస్తుంటారు. ఒక వేళ మార్చడం మరిచిపోతే ఆలయాన్ని దాదాపు 18సంలు మూసివేయాలని భావిస్తారు.
పూరీ జగన్నాధుడి రధయాత్ర
ఈ ఆలయ ప్రత్యేకతలో రధయాత్ర ఎంతో ముఖ్యమైనది. ఈ రధయాత్రలో కూడా కొన్ని ప్రత్యేకతలు వున్నాయి. రధయాత్రకు ముందు పూరీ రాజు బంగారు చీపురుతో రథాల ముందు వూడ్చి తాళ్ళను లాగటంతో రధయాత్ర ప్రారంభమౌతుంది.పూరీ వీధుల్లో శ్రీకృష్ణ , బలరాముల విగ్రహాలను వూరేగిస్తారు. రధం సుమారు 45 అడుగుల ఎత్తు , 35 అడుగులు వెడల్పు వుంటుంది. ఈ రధానికి సుమారు 16 చక్రాలుంటాయి. పూరీ జగన్నాధ రెండు రధాలు లాగుతారు.మొదటి రధం దేవుళ్ళను రధం వరకు తీసుకెళుతుంది. ఆ తరవాత 3 చెక్క పడవళ్ళలో దేవతలు నది దాటాలి. అక్కడి నుంచి మరో రధం దేవుళ్ళను గుండీచ ఆలయానికి తీసుకెళుతుంది.
రధయాత్రలోని విశిష్టత
ప్రతీ ఏడాది జరిగే ఈ రధయాత్రలో ఒక విశిష్టత జరుగుతుంది. గుండీచ ఆలయానికి వూరేగింపు చేరుకోగానే రథం దానంతట అదే ఆగిపోతుంది. ఇది ఆలయంలో ఒక విశిష్టత. సాయంత్రం 6 గంటల తర్వాత ఆలయతలుపులు మూసేస్తారు.
సుదర్శన చక్రం
పూరీలో అత్యంత ప్రసిద్ధిచెందిన జగన్నాధ ఆలయం చాలా ఎత్తైనదిమీరు పూరీలో ఎక్కడ నిలబడినా గోపురం వైపు ఉన్న సుదర్శన చక్రాన్ని చూసినా అది మీ వైపు తిరిగినట్టుమిమ్మల్ని చూస్తున్నట్టు కనిపించటం ఇక్కడి ప్రత్యేకత.
సముద్రపు అలలు
సాధారణంగా తీర ప్రాంతాలలో గాలి సముద్రపు వైపు నుంచి భూమి వైపుకి వుంటుంది. సాయంత్రపు పూట గాలి నేలవైపు నుంచి సముద్రం వైపుకు వీస్తుంది. కానీ పూరీలో అంతా విభిన్నం.
దీనికి వ్యతిరేకంగా గాలి వీస్తుండటం ఇక్కడి ప్రత్యేకత. పూరీ జగన్నాధ ఆలయం పైన పక్షులుగానీ , విమానాలు గానీ అస్సలు వుండవు. అది ఎందుకు అనేది ఇప్పటికీ ఎవ్వరికీ అంతు చిక్కటం లేదు.
సాధారణంగా మనం సముద్రతీరాన ఆలయానికి వెళ్ళినప్పుడు మనం బయటవున్నంతసేపు సముద్రపు అలలు , వాటి శాభ్దాలు మనకు వినిపిస్తాయి. లోపలికి వెళ్ళినాకూడా ఆ శాభ్దాలు స్పష్టంగా వినిపిస్తాయి.
కానీ ఈ పూరీ జగన్నాధ ఆలయంలో అలా వుండదు. సింహద్వారం గుండా ఆలయంలో ప్రవేశిస్తూ ఒక్క అడుగు గుడి లోపలికి పెట్టగానే సముద్రంలో నుంచి వచ్చే శబ్దం ఏ మాత్రం వినిపించదు. కానీ ఎప్పుడైతే బయటకు అడుగు పెడతారో వెంటనే చాలా క్లియర్ గా వినపడుతుంది.అయితే సాయంత్రం పూట ఈ రహస్యాన్ని అంత శ్రద్ధగా గమనించలేరు. దీనికి కారణం కూడా వుంది. ఇద్దరు దేవుళ్ళ సోదరి సుభద్రా దేవి ఆలయం లోపల ప్రశాంతత కావాలని కోరటం వల్ల ఇలా జరుగుతుందని ఆలయ పూజారులు చెప్తారు.
అంతేకానీ దీని వెనక ఎలాంటి సైంటిఫిక్ రీజన్స్ లేవని వివరిస్తారు కూడా. ఈ ఆలయంలో విగ్రహాలు చెక్కతో తయారుచేసినవి. ఇక్కడ శ్రీకృష్ణుడు , సుభద్ర , బలరామ సమేతంగా భక్తులకు దర్శనమిస్తారు.
రథయాత్ర
ప్రతి సంవత్సరం పర్యాటకులు అధిక సంఖ్యలో రథయాత్ర లేదా రథం పండుగ సమయంలో సందర్శిస్తారు. పండుగ సమయంలో దేవతలైన జగన్నాథ్ , బలభద్ర మరియు సుభద్రల విగ్రహాలను బాగా అలంకరించిన రథాల్లో ఉంచి గుండిచ ఆలయానికి ఊరేగింపుగా తీసుకువచ్చి తిరిగి జగన్నాథ ఆలయానికి తీసుకువస్తారు.ఈ ఉత్సవము సాధారణంగా జూలై నెలలో జరుగుతుంది. ఈ ఉత్సవము పూరీ పర్యాటక క్యాలెండర్ లో అత్యంత ముఖ్యమైన ఆకర్షణగా చెప్పవచ్చు.
ప్రత్యేకత
ఇక్కడ దేవునికి సమర్పించే ప్రసాదం. పూరీ జగన్నాధ ఆలయంలో 56 రకాల ప్రసాదాలు సమర్పిస్తారు. ఈ ప్రసాదాలు కేవలం ఆలయ వంటశాలలో మట్టికుండలో మాత్రమే తయారు చేస్తారు. ఈ ప్రసాదాలు చేసి దేవుడికి సమర్పించే ముందు వరకు ఎలాంటి రుచి , వాసన వుండదు.ఎప్పుడైతే దేవుడికి సమర్పిస్తారో వెంటనే ఘుమఘుమలతో పాటు రుచి కూడా వుంటుంది. మరొక ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక సంవత్సరం వరకు పాడవకుండా వుంటుందట. ఈ ప్రసాదాన్ని దాదాపు 2000మంది దగ్గర నుంచి 2 లక్షల వరకు భక్తులకు ఇవ్వొచ్చు.
ఇంకా దేవుడికి పెట్టె నైవేద్యం 7 మట్టి కుండలలో ఒకదాని పైన ఒకటి పెట్టి వండుతారు సాధారణంగా మంట పైన వున్న కుండలోని ఆహారం మొదటగా వుడుకుతుంది. కానీ ఇక్కడ ఏడవకుండలోని ఆహారం వుడికిన తర్వాత చివరగా వున్న కుండలోని ఆహారం వుడుకుతుంది.
అదే ఇక్కడి ప్రసాదం , నైవేద్యం యొక్క ప్రత్యేకత. ఇన్ని విశేషాలు , అద్భుతాలు కలిగిన పూరీ జగన్నాథ్ ఆలయాన్ని ప్రతీ ఏడాది లక్షలమంది భక్తులు సందర్శిస్తారు. మీరు కూడా జీవితంలో ఒక్కసారైనా ఈ అద్భుతాన్ని చూసి తరించండి. తప్పకుండా పూరీ జగన్నాధఆలయాన్ని దర్శించండి.
పూరీ మరియు పరిసరాలలోని పర్యాటక స్థలాలు
పర్యాటకులకు పురీలో సందర్శించటానికి అనేక ఆలయాలు ఉన్నాయి. హిందువులకు పూరీ భారతదేశంలో ఉన్న ఏడు అత్యంత పవిత్ర స్థలాలలో ఒకటిగా ఉన్నది. ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాత
జగన్నాథ ఆలయమే కాక చక్ర తీర్థా ఆలయం , ముసిమ ఆలయం , సునర గౌరంగ్ ఆలయం , శ్రీ లోక్నాథ్ ఆలయం , శ్రీ గుండిచ ఆలయం , అలర్నాథ్ ఆలయం మరియు బలిహర్ చండి ఆలయం మొదలైనవి హిందువులకు ముఖ్యమైన ప్రార్థనా ప్రదేశాలుఉన్నాయి.
మరోక ప్రత్యేకతగోవర్ధన మఠం వంటి మఠాలు దైవిక ఉపశమనం అందిస్తున్నాయి. బేడి హనుమాన్ టెంపుల్ కి సంబంధించిన స్థానిక పురాణము కలిగి ఉంది. పూరీ బీచ్ మరొక ముఖ్యమైన పర్యాటక ఆకర్షణ కేంద్రంగా ఉంది.వార్షిక పూరీ బీచ్ ఫెస్టివల్ పూరీ పర్యాటకంలో ఆకర్షణగా ఉంటుంది. ఈ బీచ్ ను హిందువులు పవిత్రమైనదిగా భావిస్తారు. అంతేకాక ఈ బీచ్ సుందరమైన వీక్షణ నిజంగా మంత్రముగ్ధుణ్ణి చేస్తుంది.ఉదయిస్తున్న సూర్యుడి చూడటం లేదా అస్తమిస్తున్న సూర్యుడి చూడటంతో తీర్థయాత్ర ముగుస్తుంది అనుకుంటున్నారా ? కానేకాదు పర్యాటకులు బలిఘి బీచ్ వద్ద కోణార్క్ సముద్ర డ్రైవ్ చేయవచ్చు. పూరీ మతసంబంధ ఆసక్తికరమైన మరొక ప్రదేశం హిందూ మత శ్మశానం స్వర్గాద్వర్ ఉంది.
పూరీ నుండి 14 కిమీ దూరంలో భారతదేశం యొక్క సాంస్కృతిక రాజధాని రఘురజ్పూర్ ఉన్నది. ఒరిస్సాలో అత్యంత ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన షాఖిగోపాల్ పూరీ నుండి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నది.
నీటి ప్రేమికులు లేదా సర్ఫింగ్ ఆస్వాదించే వారికి మరొక అద్భుతమైన ఆకర్షణ కేవలం పూరీ నుండి 50 కిమీ దూరంలో సాత్పదా వద్ద ఉంది. పూరీ నుండి సాత్పదా చేరుకోవటానికి అనేక బస్సులు మరియు టాక్సీలు అందుబాటులో ఉంటాయి.
పూరీ సందర్శించడానికి ఉత్తమ సమయం
ఈ ప్రదేశాన్ని దర్శించడానికి ఉత్తమ సమయం జూన్ నెల నుండి మార్చి వరకు ఉంటుంది.
