Thursday, February 26, 2026

కాసుల కల నెరవేరిన వేళ

కాంగ్రెస్ పార్టీ కష్ట కాలంలో ఉన్న సమయంలో పార్టీ బలోపేతానికి బాన్సువాడ నియోజకవర్గం లో కాసుల బాలరాజు ఎంతో శ్రమించారు. రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బాన్సువాడ బరిలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఆర్థికంగా మానసికంగా ఎంతో కృంగిపోయారు.

ఐనప్పటికీ బాలరాజు ఏనాడు వెనకడుగు వేయకుండా బాన్సువాడ నియోజకవర్గం లో కార్యకర్తలకు అండగా నిలిచారు. తీరా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హవా బలంగా వీచే సందర్భంలో శాసనసభ ఎన్నికల సీట్ల కేటాయింపులో కాసులకు చుక్క ఎదురయింది. పట్టు వీడని విక్రమార్కుడిగా రాజకీయ పోరాటం ఆనాటి నుండి నేటి వరకు చేస్తూనే వచ్చారు. ఆనాటి శాసనసభ ఎన్నికల్లో ఢిల్లీ అధిష్టానం బాన్సువాడ టికెట్ ను ఏనుగు రవీందర్ రెడ్డికి కేటాయించింది. టికెట్ రాకపోవడంతో కాసుల నిరుత్సాహం నిస్పృహాలకు లోనయ్యారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ వారికి కచ్చితంగా గుర్తింపు ఉంటుందని పార్టీ గెలుపుకు కృషి చేయాలని నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు బాలరాజును బుజ్జగించారు.

ఇచ్చిన మాటను నిలబెట్టి తీర్చుకోవడంలో ముఖ్యమంత్రి అనతి కాలంలోనే కార్యకర్తల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోగలిగారు. పార్లమెంట్ ఎన్నికల ముందే కాసుల బాలరాజు కు ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ పదవిని రేవంత్ ప్రభుత్వం ఖరారు చేసింది. ఆనాడు ఎన్నికల కోడ్ రావడంతో న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయి అన్న ఆలోచనతో, మరోపక్క నియోజకవర్గాల్లో నాయకులు రాజకీయ గ్రూపులుగా విడిపోయి పార్లమెంటు ఎన్నికల్లో నష్టం జరుగుతుందన్న దృక్పథంతో రేవంత్ నామినేట్ పదవులను ప్రకటన చేసి కూడా నిలుపుదల చేశారు.

అయినప్పటికీ కాసుల బాలరాజు బాన్సువాడలో ఏనుగుతో రాజకీయంగా ముందుకు సాగేందుకు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాసులకు జుక్కల్ నియోజకవర్గం బాధ్యతలను ముఖ్యమంత్రి అప్పగించారు. తన నియోజకవర్గం కానప్పటికీ జుక్కల్ నియోజకవర్గంలో కాసులకు మంచి పట్టు ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో తన రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి మెజార్టీ ఓట్లను రాబట్టగలిగారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన బిజెపి అభ్యర్థి బిబి పాటిల్ సొంత నియోజకవర్గం జుక్కల్ ఐ నప్పటికీ, ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, మరి కొంతమంది నాయకులు టీం గా ఏర్పడి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీది పై చేయిగా నిరూపించుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ షెట్కార్ గెలుపుకు తీవ్ర కృషి చేశారు. ఎట్టకేలకు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సోమవారం నామినేటెడ్ పోస్టుల ఖరారు అధికారికంగా విడుదల చేశారు. దీంతో కాసుల బాలరాజుకు ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ పదవి వరించింది. రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ బాన్సువాడ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయడంలో కాసుల కృషి ఏనలేనిదిగా భావించవచ్చు. బాన్సువాడ నియోజకవర్గం లో పోచారం శ్రీనివాస్ రెడ్డి తన ఆధిపత్యాన్ని మొదటి నుండి కొనసాగిస్తూ వస్తున్నారు. అయినప్పటికీ కాసుల ఏనాడు వెనకడుగు వేయకుండా పోచారం శ్రీనివాస్ రెడ్డితో డీ అంటే డీ అంటూ పోటీ పడుతూ వచ్చారు. బాన్సువాడ నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ గ్రూపు వివాదాలు తారా స్థాయికి చేరాయి. ఏనుగు రవీందర్ రెడ్డి తన అధిపత్యాన్ని కొనసాగించే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేగా ఏడుసార్లు గెలుపొందిన పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలుగుదేశం, టిఆర్ఎస్ పార్టీలో ఎన్నో ఉన్నత పదవులను అధిరోహిస్తూ వచ్చారు. శాసనసభ ఎన్నికల్లో బాన్సువాడ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి గెలుపొందినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకుంది. రవీందర్ రెడ్డి ఓటమిపాలైనప్పటికీ బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా నియమించింది.

దీంతో ఆరు నెలల పాటు ఏనుగు రవీందర్ రెడ్డి బాన్సువాడలోనే కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ కార్యకర్తల్లో మరింత ఉత్సాహాన్ని నింపారు. మరోపక్క ప్రత్యర్థి అయినటువంటి పోచారం శ్రీనివాస్ రెడ్డికి అడుగడుగునా ఏనుగు అడ్డుకట్టలు వేస్తూ వచ్చారు. ఏనుగు రవీందర్ రెడ్డి కి పోచారం తో పాటు సొంత పార్టీకి చెందిన కాసుల బాలరాజు ఇద్దరు ప్రత్యర్థులుగా మారారు. పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ కుదేలైంది. భవిష్యత్తులో కూడా ఆ పార్టీకి ప్రజలు ఆదరించే పరిస్థితులు కనిపించడం లేదు. భవిష్యత్ రాజకీయాలను ఆలోచన చేసుకుని పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బాన్సువాడ నియోజకవర్గం లో రాజకీయ సమీకరణలు అతివేగంగా మారుతూ వస్తున్నాయి. ఎన్నో ఏళ్ల నుండి ప్రత్యర్థులుగా ఉన్న కాసుల బాలరాజు పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబం ఒకటయ్యారు. ఏనుగు రవీందర్ రెడ్డి ఆదిపత్యానికి చెక్ పెట్టాలంటే వీరు ఇద్దరు ఒక్కటై తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలన్న ఏకైక లక్ష్యంతో స్నేహం చేసేందుకు ప్రత్యర్ధులు సిద్ధపడ్డారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి భవిష్యత్తులో తన ఆధిపత్యాన్ని కొనసాగించుకునేందుకు బాటలు వేసుకున్నారు. కాసుల బాలరాజుకు ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ పదవి ఇవ్వడంతో ఆయనకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయగలిగింది. బాన్సువాడ నియోజకవర్గం లో కాసులకు మంచి పట్టు ఉండడంతో ప్రభుత్వం ఇచ్చిన చైర్మన్ గిరి తో తనకున్న అనుభవాన్ని, ఆసరా చేసుకుని నియోజకవర్గంలో మరింత పట్టు సాధించే అవకాశాలు ఉన్నాయి. ఏనుగు రవీందర్ రెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా కొనసాగుతున్నప్పటికీ నేటి రాజకీయ పరిస్థితులు ఎటు వెళ్తాయో తెలియని పరిస్థితులు ఉన్నాయి. గతంలో రెండు గ్రూపులుగా ఉన్న బాన్సువాడ కాంగ్రెస్ ప్రస్తుతం పోచారంతో మూడు గ్రూపుల కాంగ్రెస్ గా విడిపోయి అయోమయంలో పడిపోయింది.

కాసుల అనుచర్ల సంబరాలు అంబరాన్ని అంటిన వైనం

కాసుల బాలరాజుకు ఎన్నో నెలలుగా ఎదురుచూస్తున్న ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ పదవి వరించడంతో ఆయన అనుచరులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. పలు మండలాల్లో ఆయన అనుచరులు సంబరాలు అంబరాన్ని అంటయి. టపాకాయలు కాలుస్తూ స్వీట్స్ లను పంపిణీ చేశారు.

ముఖ్యమంత్రిని కలిసిన కాసుల

తనకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సోమవారం కాసుల బాలరాజు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కాసుల రాజకీయ ఎదుగుదలకు ఆనాటి నుండి నేటి వరకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ ఆలీ అండదండలు అందిస్తూ వచ్చారు. ఆయన వెంట ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, కోటగిరి మాజీ ఎంపీటీసీ కొట్టం మనోహర్, నిజాంబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular