ద్రోణ భోపాల్
మధ్యప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకొంది. ఇటీవల భాజపాలో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేకు రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గంలో చోటు కల్పించింది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం ప్రమాణస్వీకార కార్యక్రమం ఏర్పాటుచేశారు. ఈ సమయంలో జరిగిన ఓ చిన్నతప్పిదం కారణంగా రామ్‌నివాస్ రావత్ రెండుసార్లు మంత్రిగా ప్రమాణం చేయాల్సి వచ్చింది. ఇదంతా నిమిషాల వ్యవధిలో చోటుచేసుకోవడం గమనార్హం. వివరాల్లోకి వెళితే
రామ్‌నివాస్ రావత్ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి షియోపుర్ జిల్లాలోని విజయ్‌పుర్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆయన భాజపాలో చేరారు. తాజాగా రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించినట్లు సీఎం మోహన్‌యాదవ్ ప్రకటించారు. నేటి ఉదయం రావత్‌తో గవర్నర్ మంగుభాయ్ సీ పటేల్ మంత్రిగా ప్రమాణం చేయించారు. ఆ సమయంలో రావత్ ‘రాజ్య మంత్రి’ (రాష్ట్ర మంత్రి)కి బదులు ‘రాజ్యా కే మంత్రి’ (సహాయ మంత్రి) అని పొరబాటున చదివారు. దీంతో అక్కడ గందరగోళ వాతావరణం ఏర్పడింది. అలా ఆ ప్రమాణాన్ని రద్దు చేయాల్సి వచ్చింది. అనంతరం 15 నిమిషాలకే రాష్ట్ర మంత్రిగా మరోసారి ప్రమాణం చేశారు.
కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన సీనియర్ నేత రామ్‌నివాస్ రావత్ ఇప్పటివరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. భాజపాలో చేరి నెలలు గడుస్తున్నా కాంగ్రెస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. ఇది రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఆయన ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తే త్వరలో ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉంది.
