కలెక్టర్ రాజీవ్ గాంధీ
హనుమంతు
కమ్యూనిటీ హెల్త్ సెంటర్, పాఠశాలలు తనిఖీ
ద్రోణ నిజామాబాద్, జూలై 12
ప్రభుత్వ ఆసుపత్రులకు ఎంతో నమ్మకంతో వచ్చే నిరుపేదలు, సామాన్య ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించి, సర్కారు దవాఖానాల పనితీరుపై మరింత నమ్మకాన్ని పెంపొందించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు వైద్యాధికారులు, సిబ్బందికి హితవు పలికారు. శుక్రవారం ఆయన వర్ని మండల కేంద్రంలోని ప్రభుత్వ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను తనిఖీ చేశారు.

30 పడకల సామర్ధ్యం కలిగిన ఈ ఆసుపత్రిలో రోగులకు అందిస్తున్న వైద్య సేవల తీరును కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రిలోని రిజిస్ట్రేషన్ కౌంటర్, అవుట్ పేషంట్, ఇన్-పేషంట్ విభాగాలు, వివిధ వార్డులను సందర్శించారు. ప్రతి శుక్రవారం నిర్వహించే ఆరోగ్య మేళా సందర్భంగా అందిస్తున్న ప్రత్యేక వైద్య చికిత్సలు, మధుమేహం, రక్తపరీక్షలు చేస్తున్న తీరును పరిశీలించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోజు సగటున ఎంతమంది రోగులు వస్తారు, ఎంతమంది ఇన్ పేషంట్లుగా చేరుతున్నారు,

స్థానికంగానే కాన్పులు చేస్తున్నారా అని వైద్యులను ఆరా తీశారు. సాధారణ ప్రసవాలను స్థానికంగానే చేస్తున్నామని, హైరిస్క్ కేసులను బోధన్ లోని జిల్లా ఆసుపత్రికి, నిజామాబాద్ లోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి రెఫర్ చేస్తున్నామని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ వైద్యులు, సిబ్బంది హాజరు పట్టికను తనిఖీ చేశారు. రోగులను పలుకరించి వారికి అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. వైద్యులు అందుబాటులో ఉండడం లేదని పలువురు కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని తన వెంట ఉన్న జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా గల అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో బయోమెట్రిక్ హాజరు విధానాన్ని అమలు చేయాలని సూచించారు. వైద్యులు, సిబ్బంది అందరూ తప్పనిసరిగా సమయపాలన పాటించేలా పర్యవేక్షణ చేయాలని, ప్రజలకు సంతృప్తికర స్థాయిలో సేవలందేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

పనులలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి
పాఠశాలల్లో మౌలిక వసతులను పెంపొందించేందుకు చేపడుతున్న పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా చూడాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులకు సూచించారు. శుక్రవారం ఆయన వర్ని మండలం లోని శ్రీనగర్ ప్రభుత్వ జిల్లా పరిషత్ఉన్నత పాఠశాలను, సత్యనారాయణపురంలోని ప్రభుత్వ బాలికల జెడ్పి హైస్కూల్ ను సందర్శించారు. నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదులతో పాటు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను పరిశీలించారు. తుది దశలో మిగిలి ఉన్న పనులను సైతం నాణ్యతతో చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. విద్యార్థులకు ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాల పంపిణీ జరిగిందా అని అడిగి తెలుసుకున్నారు.

పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచాలని, పాఠశాల ఆవరణను చదును చేయించి మొరం వేయించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ వెంట జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి తుకారాం రాథోడ్, డీఈఓ ఎన్.వీ.దుర్గాప్రసాద్ తదితరులు ఉన్నారు.
