ప్రారంభించిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
మెరుగైన సేవలు అందించాలని వైద్యులకు హితవు
ద్రోణ నిజామాబాద్, జూలై 14 :
బోధన్ పట్టణంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో అందుబాటులోకి తెచ్చిన ఉచిత డయాలసిస్ సేవల విభాగాన్ని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఆదివారం ప్రారంభించారు. డయాలసిస్ విభాగం ద్వారా రోగులకు అందించే సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.

ప్రతిరోజూ సగటున ఇరవై మంది వరకు డయాసిస్ సేవలు వినియోగించుకోవచ్చని వైద్యులు తెలిపారు. చుట్టుపక్క మండలాల నుండి డయాలసిస్ పేషంట్లు ఇక్కడికి వస్తారని, ఏకకాలంలో ఏడుగురు చొప్పున రోగులకు డయాలసిస్ చేయవచ్చని కలెక్టర్ దృష్టికి తెచ్చారు. రోగులకు మెరుగైన సేవలు అందించాలని, ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరుపై ప్రజల్లో నమ్మకాన్ని పెంపొందించాలని

ఈ సందర్భంగా కలెక్టర్ హితవు పలికారు. ఆసుపత్రిలోని ఆర్.ఓ ప్లాంట్, పోస్ట్ ఆపరేటివ్ వార్డ్, ఇతర విభాగాలను కలెక్టర్ సందర్శించి, స్థానికంగా గల సౌకర్యాలను పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇన్ పేషంట్లను పలుకరించి, వారికి అందుతున్న వైద్య సేవల గురించి వాకబు చేశారు. వైద్యుల కొరత ఉన్నట్లయితే కాంట్రాక్టు పద్ధతిలో వైద్యుల నియామకాల కోసం ప్రతిపాదనలు పంపించాలని అధికారులకు సూచించారు. వైద్యులు, సిబ్బంది అందరూ సమయ పాలన పాటిస్తూ రోగులకు నాణ్యమైన సేవలు అందించేలా అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని అన్నారు.

ప్రస్తుత వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలేందుకు ఎక్కువగా ఆస్కారం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని, వ్యాధులు సోకకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని సూచించారు. కలెక్టర్ వెంట బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్, తహసీల్దార్ కె.గంగాధర్, డీసీహెచ్ఎస్ డాక్టర్ శివశంకర్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాములు, ఆర్.ఎం.ఓ డాక్టర్ అబ్దుల్ రహీం తదితరులు ఉన్నారు.
